ఒత్తిడి భరించలేకే చేయి నరుక్కున్నా

5 Jul, 2014 02:30 IST|Sakshi
ఒత్తిడి భరించలేకే చేయి నరుక్కున్నా

 ‘తెలిసీ తెలియని వయస్సులో చెడు సావాసాలు పట్టి చోరీలకు అలవాటుపడ్డా. అది గతం. ఇప్పుడు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. దొంగతనాలు మానేద్దామనుకుంటే పోలీసులు ఒప్పుకోవడం లేదు. నక్సలైట్లు మారిపోతే ఇల్లు, పొలం ఇస్తున్నారు. నేను చోరీలు మానేస్తానంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. పోలీసుల బలవంతంతో చోరీలు కొనసాగించడం ఇష్టం లేక చేయి నరుక్కున్నా.’ పాత నేరస్తుడు భూక్యా నాగరాజు కథనమిది..
 
విజయవాడ క్రైం : ఎ.కొండూరు మైత్రీనగర్‌కు చెందిన భూక్యా నాగరాజు పాత నేరస్తుడు. ఇతడిపై వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో 135 దొంగతనాల కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో శిక్ష అనుభవించాడు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొద్ది రోజుల కిందట రాజమండ్రి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్కడ ఉండగానే హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. గత మంగళవారం బెయిల్ విడుదలయ్యాడు.

రికవరీ కోసం హైదరాబాద్ పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో భరించలేక కుటుంబ సభ్యుల తో కలిసి పురుగుల మందు తాగి చనిపోవాల నుకున్నాడు. ఈ ప్రయత్నాన్ని ఇరుగు పొరుగు వారు అడ్డుకున్నారు. నాగరాజు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి ఎవరో పోలీసులు వచ్చారంటూ కు టుంబ సభ్యులు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందాడు. ఊరికి  దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్లి కుడి చేయి మణికట్టుపై కత్తితో నరుక్కున్నాడు.

మైలవరం సమీపంలోని నాగులూరులో ఉంటున్న సోదరుడు చిట్టిబాబుకు ఫోన్‌లో విషయం చెప్పాడు. చిట్టిబాబు వచ్చి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఇక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేసి నాగరాజు కుడిచేయి ని మణికట్టు వరకు తొలగించారు. ప్రస్తుతం ఇ తడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెపుతున్నారు. ఈ సందర్భంగా నాగరాజు ‘సాక్షి’తో పలు విషయాలు చెప్పాడు.
 
రికవరీ కోసం ఒత్తిడి
 
ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే పోలీసులు రికవరీ కోసం తనను వేధింపులకు గురి చేస్తారని నాగరాజు తెలిపారు. నేరం చేయకపోయి నా రికవరీ ఇవ్వాల్సిందేంటున్నారని, లేదంటే నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నాడు. లేదంటే చేయని నేరాలపై జైలుకు పం పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
షాపుల యజమానుల ఉసురు తగులుతుందేమో..
 
అమ్మని నగలు కూడా అమ్మినట్టు చెప్పాలం టూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని నాగరాజు తెలిపాడు. ఏయే షాపుల్లో ఏ నగలు విక్రయిం చిందీ చెప్పాలనేది ముందుగానే తనకు చెప్పి దుకాణాలు చూపిస్తారన్నాడు. ఆ తర్వాత షాపుల వద్దకు తీసుకెళ్లి డ్రామా నడుపుతారని, అనేకమంది బంగారు షాపుల యజమానులు చేయని నేరానికి రికవరీ ఇవ్వాల్సి వచ్చేదన్నా డు. ఇలా చేయడం వల్ల తనకూ, తన కుటుం బానికి ఉసురు తగులుతుందనే బెంగ పట్టుకుందని చెప్పాడు.
 
ఎన్‌కౌంటర్ పేరిట బెదిరింపు
 
దొంగతనాలు మానేసినా.. రికవరీ ఇవ్వకున్నా గజదొంగ అడపా వెంకన్న మాదిరిగానే ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టు నాగరాజు పేర్కొన్నాడు. తనతో దొంగతనాలు చేయించి పోలీసు అధికారులు బాగుపడుతున్నట్టు తెలిపాడు. చేతులు లేకపోతే దొంగతనాలు చేయాలని అడగలేరని, అందుకే చేయి నరుక్కున్నానని చెప్పాడు.
 
నోరు విప్పితే పలువురు కటకటాల వెనక్కే

తాను నోరు విప్పితే పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది జైలుపాలవుతారని నాగరాజు తెలిపాడు. అన్ని జిల్లాల పోలీసులు తనను నేరాలు చేయమని ప్రోత్సహించి సొమ్ములు వెనుకేసుకున్న వారేనని పేర్కొన్నాడు. తన గతి వాళ్లకు పట్టడం ఇష్టం లేకే నోరు మెదపడం లేదని అన్నాడు. దొంగతనాలు మానేయాలనుకుంటున్నానని, తనను వదిలేయాలని నాగరాజు కోరుతున్నాడు. వేధింపులు కొనసాగితే ఈసారి తల నరుక్కుంటానని అతడు పేర్కొన్నాడు. వేధింపులు ఇలాగే కొనసాగితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని నాగరాజు భార్య ఝాన్సీ తనను కలిసిన విలేకరులతో విలపిస్తూ చెప్పింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా