మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి

6 Feb, 2020 14:00 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం తీసుకు వస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పీల్‌ చేయాల్సి ఉందన్నారు. డబ్బు సంపాదించుకున్న కులంలో మనం మాత్రమే బాగుపడాలనే ఆలోచన వస్తే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నారు. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గితే వారిలో 1144 మంది అంటే 50.39 శాతం రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. (మార్గదర్శి కేసులో.. ఉండవల్లి పిటిషన్‌ స్వీకరణ)

కులాలకు సంబంధించి కూడా ఓ పుస్తకం రాస్తానని ఉండవల్లి తెలిపారు. రాజధానికి 30 వేల ఎకరాలు దేనికని గతంలోనే అడిగానని, రాజధానికి భూములు త్యాగం కాదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 700 కోట్లు మిగల్చడం సరైనదేనని తెలిపారు. చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 53773 ఎకరాలు సీటీల అభివృద్ధి కోసం కావాలంటూ గ్రాఫిక్స్‌ చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు మంచి నిర్ణయమని ప్రశంసించారు. మాజీ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షలు ఎన్ని ఆరోపణలు చేసినా.. ప్రజలు అత్యధిక ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. 

చదవండి : కేసులో నేరం రుజువైతే భారీ జరిమానా: ఉండవల్లి

మరిన్ని వార్తలు