జటిలం!

21 Apr, 2019 09:36 IST|Sakshi

జిల్లాలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. పలు మండలాల్లో 90 మీటర్లకు పైగా ఇంకిపోయాయి. అనేక మండలాలు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని అత్యంత ప్రమాదకర స్థాయిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యవసాయ బోరుబావులు దాదాపు 70 శాతానికిపైగా అడుగంటిపోయాయి. సాగు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సాగునీరు లేక కాడె పక్కన పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.     ఇక తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోర్లలో దాదాపు సగానికిపైగా ఎండిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు గుక్కెడు నీటి కోసం వెంపర్లాడాల్సి వస్తోంది. ఎండలు ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు అగ్రికల్చర్‌: జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. ఏడాదిన్నరగా తీవ్ర వర్షాభావం నెలకొంది. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. 35 మండలాలు డేంజర్‌ జోన్‌కు చేరాయి. మరో 21 మండలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరువయ్యాయి. అత్యధికంగా పీలేరు మండలంలో 97 మీటర్ల మేరకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రామసముద్రంలో 90 మీటర్లు, వి.కోటలో 90, గుర్రంకొండలో 88, కలికిరిలో 84, కలకడలో 82, తంబళ్లపల్లెలో 81, పెద్దమండ్యంలో 80, పెద్దపంజాణిలో 78, కురబలకోటలో 72, ములకలచెరువులో 72, బంగారుపాళ్యంలో 68, నిమ్మనపల్లెలో 68, ఐరాలలో 59, కేవీపల్లెలో 57, బి కొత్తకోటలో 56, పీటీఎంలో 55, పులిచెర్లలో 48, పుంగనూరులో 48, మదనపల్లెలో 40, రొంపిచెర్లలో 40 మీటర్ల మేరకు భూVýæర్భ జలాలు అడుగంటిపోయాయి. మరో 14 మండలాల్లో 25 మీటర్లకు పైబడి జలాలు ఇంకిపోయాయి. సాధారణంగా అధికారులు 25 మీటర్లకు పైబడి జలాలు అడుంగటిన ప్రాంతాలను ప్రమాదకర స్థాయిగా నిర్ణయిస్తారు. 40 మీటర్లకు పైబడి జలాలు అడుగంటిన ప్రాంతాలను అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఈ లెక్కన అత్యంత ప్రమాదకర ప్రాంతా లుగా 21 మండలాలను పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
 
తాగునీటికీ తంటాలే..
జిల్లాలో మొత్తం 1,368 పంచాయతీలకు గాను 11,189 గ్రామాలు ఉన్నాయి. తాగునీటి సౌకర్యార్థం 8,802 బోర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్షాభావం కారణంగా అందులో ఇప్పటికే 3,500 బోర్లు ఇంకిపోయాయి. ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య జఠిలమైంది. ప్రభుత్వం కేవలం 1,641 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 324 గ్రామాలకు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తోంది. మిగిలిన గ్రామాల్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరో రెండు వారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 శాతానికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశముందని అధికారుల అంచనా.చతికిలపడిన సాగు జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 3.8 లక్షల హెక్టార్లలో రైతులు అన్ని రకాల పంటలను సాగుచేస్తారు. అందులో ఖరీఫ్‌లో 2.11 లక్షల హెక్టార్లు, రబీలో 70 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఇవిగాక ఉద్యాన పంటల కింద మామిడిని మరో 98 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పంటలకు అవసరమైన సాగునీటి కోసం వ్యవసాయ బావులు 90 వేలు ఉండగా, బోర్లు 2.82 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావంతో దాదాపు 70 శాతం మేరకు బావులు, బోర్లు అడుగంటిపోయాయి. పంటలు సాగుచేయలేక వ్యవసాయ భూములను బీళ్లుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు