'పేదింటి'పై పెద్ద మనసేదీ?

9 Dec, 2018 04:20 IST|Sakshi

పట్టణ పేదల ఇళ్లకు అసమగ్ర ప్రతిపాదనలు

సరిగ్గా పంపితే కేంద్రం నుంచి గృహాలకు రూ.2,169 కోట్లు వచ్చేవి

పోర్టల్‌లోనూ అప్‌లోడ్‌ చేయని లబ్ధిదారుల జాబితా 

మూడో పార్టీ తనిఖీ నివేదిక కూడా అంతే..

అన్ని శాఖలు సమగ్ర ప్రతిపాదనలు పంపితే మొత్తం రూ.2,612 కోట్లు వస్తాయి

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ నివేదిక

సాక్షి, అమరావతి : పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం మంజూరు చేసే నిధులను తెచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ ఇళ్ల నిర్మాణ వ్యయాలను భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేదవాడిపై రూ.4లక్షల మేర అప్పుల భారం మోపుతూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొందడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసమగ్ర ప్రతిపాదనలను వచ్చినట్లు ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. 20 కేంద్ర పథకాలకు సంబంధించి అసలు ప్రతిపాదనలే పంపలేదని.. పది పథకాలకు అసమగ్ర ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చాయని.. దీంతో కేంద్రం మరిన్ని వివరాలతో పంపాలని కోరినందున వాటిని పంపించేలా చూడాలని తన నివేకలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. పట్టణ పేదల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడంతోపాటు థర్డ్‌ పార్టీ తనిఖీ నివేదికను కేంద్రానికి పంపిస్తే రూ.2,169 కోట్లు రాష్ట్రానికి వస్తాయని ఆయన అందులో తెలిపారు. అలాగే, పట్టణ స్వచ్ఛ భారత్‌ కింద రూ.114కోట్ల నిధుల కోసం క్షేత్రస్థాయి పురోగతి నివేదిక పంపలేదని, ఆ నివేదికను కూడా పంపాల్సిందిగా కేంద్రం కోరినట్లు తెలిపారు. కాగా, నివేదికలో రెసిడెంట్‌ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మరిన్ని అంశాలు..

- ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 2017–18లో రూ.7.31 కోట్ల రాష్ట్ర వాటాను, 2018–19లో రూ.65.17 కోట్ల రాష్ట్ర వాటాను వ్యయం చేయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అలాగే.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ నివేదికను సమర్పించకపోవడంతో పాటు కొత్తగా పూర్తిచేసే పనుల ప్రణాళికను పంపించలేదు. 
సమగ్ర చేనేత డెవలప్‌మెంట్‌ పథకం కింద రాష్ట్ర వాటా 50 శాతం వ్యయం చేసినట్లు డాక్యుమెంట్‌ను సమర్పిస్తే తదుపరి మార్కెటింగ్‌ రాయితీని విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. 
గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌ నిధుల విడుదలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన వినియోగ పత్రాలను సమర్పించాలి. 
ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ నిధుల కోసం కూడా కేంద్రం కొన్ని వివరాలు అడిగింది.
ఫిషరీస్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధుల వినియోగ పత్రాలను సమర్పించడంతో పాటు పర్యావరణ అనుమతి పత్రాలను ఇవ్వాలి.
ఇ–ఆసుపత్రుల్లో ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కింద రూ.9 లక్షలను డిపాజిట్‌ చేయాల్సి ఉంది.
ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ సర్టిఫికెట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదనలను పంపాలి.
అలాగే, బీసీల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి వినియోగ పత్రాలను సమర్పిస్తే డిసెంబర్‌ 15లోగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.

మరిన్ని వార్తలు