కొలువులు ఇస్తారా? కడతేరి పొమ్మంటారా?

2 Oct, 2018 12:59 IST|Sakshi
ట్యాంక్‌ కింద ఆందోళన చేస్తున్న నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయులు. ట్యాంక్‌ ఎక్కిన వారి సహచరుల్ని కిందకు రప్పించాలని నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయుల్ని హెచ్చరిస్తున్న పోలీసులు

సర్కారు తీరుతో నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయుల ఆక్రోశం

1056 పోస్టులని ఊరించి 47కి కుదించారని మండిపాటు

కాకినాడలో కుళాయిచెరువు ట్యాంకు ఎక్కి, ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక

నాలుగు గంటల పాటు ఉత్కంఠ అధికారుల హామీతో ఆందోళన విరమణ

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: సర్కారు తీరుపై జిల్లాలోని నిరుద్యోగ వ్యాయామోపా«ధ్యాయులు ‘అంతెత్తున’ నిరసన వ్యక్తం చేశారు. తమను చిన్నచూపు చూస్తోందని, పోస్టుల భర్తీ ప్రకటనలో వివక్ష ప్రదర్శిస్తోందని వాపోతూ సోమవారం కాకినాడ కుళాయిచెరువు ఆవరణలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటామని ఆక్రోశించారు. దాదాపు 100 మంది కుళాయి చెరువు ఆవరణలోకి రాగా 10 మంది ట్యాంకుపై భాగానికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో  కాకినాడలో ఉత్కంఠపూరితమైన పరిస్థితి నెలకొంది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపారు. గతంలో ప్రకటిస్తానన్న 1056 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలొస్తాయని  ఆశతో ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వం జిల్లాకు ఒక పీఈటీ పోస్టు మాత్రమే ఉందంటూ ప్రకటించడం దారుణమని వాపోయారు. వారి ఆందోళనతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్కంఠ నెలకొంది.

డీఈఓకు మొర పెట్టుకుని..
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయులు తొలుత కాకినాడలో డీఈవో అబ్రహాంను కలసి సమస్యలను వివరించారు. అనంతరం కుళాయి చెరువు ఆవరణకు చేరుకుని 10 మంది  ట్యాంకు పైభాగానికి చేరి ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.  మరో 90 మంది ట్యాంకు కింది భాగంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టు 1056 వ్యాయామోపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని, దీనిపై సమగ్రంగా  ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1056 వ్యాయామోపా«ధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివారావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గతంలో ప్రకటించగా ప్రస్తుతం డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కేవలం 47 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడంపై మండిపడ్డారు.  జిల్లాలో 2500 మంది వరకు పీఈటీలు శిక్షణ పొంది ఉన్నారన్నారు.  పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ ఇప్పటికే జిల్లాలోని కలెక్టర్, ఆర్‌జేడీ, డీఈఓ తదితర అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్యలకు సిద్ధమయ్యామన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పీఈటీలుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ప్రభుత్వం మోసం చేసిందని నిరసించారు. 1056 పోస్టుల భర్తీకి  ప్రకటన ఇచ్చేవరకు ట్యాంకు నుంచి కిందికి రామని భీష్మించారు.

సీఎం, మంత్రులు ప్రకటన చేయాలని డిమాండ్‌
అర్బన్‌ తహసీల్దార్‌ వరాలయ్య, టూటౌన్, ఒన్‌టౌన్, సర్పవరం సీఐలు ఎండీ ఉమర్, ఎ.సన్యాసిరావు,  డీఎస్‌ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ట్యాంకుపై ఎక్కిన వారు కిందికి  రావాలని, కలెక్టర్, డీఈవోలతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినా ఆందోళనకారులు దిగిరాలేదు. 1056 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, యనమల తక్షణం ప్రకటన చేయాలని, పూర్తి స్థాయిలో జిల్లాలోని వ్యాయామోపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ట్యాంకు నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల సమయంలో అధికారులు డీఈఓతో ఫోన్లో ఆందోళనకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పడంతో ట్యాంకుపైకి ఎక్కిన నిరుద్యోగ వ్యాయామోపాధ్యాయులు కిందికి దిగి వచ్చారు. వారిని టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉంగరాల రాము, ఎన్‌.కళ్యాణి, ఎస్‌వీవీ లక్ష్మి, కె.రమణ, అమీర్‌ సుహైల్, ఎ.శివ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు.

మరిన్ని వార్తలు