బాబూ! ఆ హామీ ఏమైంది

1 Jun, 2016 00:12 IST|Sakshi

 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. ఆ జాబితాలోనే ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చేసిన ప్రకటన కలిసిపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత డీఎస్సీ-14 ప్రకటించి సుమారు రెండేళ్ల కాలయాపన తరువాత పోస్టులు భర్తీలు చేస్తున్నారు. ఇందులో కూడా వందలాది పోస్టులు భర్తీ కాకుండా ఉండిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 120 పోస్టుల వరకు అర్హులు లేక ఖాళీగా ఉండి పోయాయి.
 
 శ్రీకాకుళం : తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2014లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో డీఎస్సీ నిర్వహిస్తారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అధికారులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహించే అవకాశాలు తక్కువన్న ప్రచారానికి బలం చేకూరుతోందంటున్నారు.
 
 విద్యాహక్కు చట్ట ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1 ఉండాలని, అయితే రాష్ట్రంలో ఈ నిష్పత్తి 18:1 గా ఉందని చెబుతుండడం పరోక్షంగా సమీప కాలంలో డీఎస్సీ ఉండదని చెప్పడమేనని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర అధికారుల్లో కొందరు ఇదే చివరి డీఎస్సీ కావచ్చని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏమిటన్నది చెప్పవచ్చు. 2014-డీఎస్సీ ప్రకటించకముందు కూడా 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి చివరకు 10,813 పోస్టులతో డీఎస్సీని ప్రకటించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 1850కి పైగా పోస్టులు అర్హులు లేక మిగిలిపోయాయి.
 
  గతంలో ఎన్నడూలేని విధంగా డీఎస్సీలో అర్హత మార్కులను నిర్దేశించడంతో పలు బీసీ-ఇ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ వర్గాలకు చెందిన పోస్టులు అర్హులు లేక బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. ఇవన్నీ భర్తీకాకుండా ఉండిపోయేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి విద్యాహక్కు చట్టం నిర్దేశించిన కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతుండడం ఒక కారణమైతే, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి పాఠశాలలను మూసివేస్తుండడం వలన మిగులు పోస్టులు ఎక్కువై వాటిని భర్తీ చేయకుండా నిలుపుదల చేసే పరిస్థితి ఉంటుంది.
 
  బహిరంగంగా ఇటువంటి ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు మాత్రం 19 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తుండడం గమనార్హం. కేంద్ర నిధులు రప్పించుకునేందుకు ఎన్నో రకాల లెక్కలను కేంద్రానికి చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ప్రతిజ్ఞ పేరిట వృథా ఖర్చు
 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం దుబారా ఖర్చులను మాత్రం  మానడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ-2014 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు విజయవాడలో జూన్ ఒకటో తేదీన ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దీని కోసం ఎంపికైన అభ్యర్థులు వ్యయప్రయాసలతో అక్కడకు చేరుకుంటున్నారు. ప్రతిజిల్లా నుంచి జిల్లా విద్యాశాఖాధికారితోపాటు కొందరి గుమస్తాలను రావాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీచేసింది.
 
 వీరికి ప్రయాణ భత్యం, వసతి కోసం సుమారు రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు విద్యాశాఖలోని కొందరు రాష్ట్రస్థాయి అధికారులే చెబుతున్నారు. ఇటువంటి ప్రతిజ్ఞ అవసరం లేకున్నా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడంతోపాటు నిధులను వృథా చేయడం పట్ల పలువురు ఆక్షేపిస్తున్నారు. ఏది ఏమైనా డీఈడీ, బీఈడీ, పండిత శిక్షణ పొందినవారు మరి కొన్నేళ్లపాటు నిరుద్యోగులుగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.
 
  హామీలన్నీ నీటి మూటలే
 రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఏ హామీనీ నెరవేర్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడేలా  చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక డీఎస్సీలు ఏమి ఉంటాయి.
 - పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ నాయకులు, శ్రీకాకుళం
 
 కష్టపడి చదివించా
 ఉద్యోగం వస్తుందన్న ఆశతో నా కూతుర్ని తెలుగు పండిట్ శిక్షణ చేయించాను. రోజువారీ కష్టపడి వస్తున్న దాంతో పస్తులుండి మరీ ఉద్యోగం వస్తుందన్న ఆశతో చదివించాను. ఇటీవలే ఒక డీఎస్సీ రాసింది. ఇక డీఎస్సీ ఉండదని అంటున్నారు. ప్రైవేటుగా కూడా ఉద్యోగాలు లేవు. నా కష్టం వృథా  అయినట్లే.
 - పాలిశెట్టి లక్ష్మణరావు, శ్రీకాకుళం
 
  డీఈడీ, బీఈడీ చదవడం వృథా
 నాది డిగ్రీ పూర్తయింది. బీఈడీ చేద్దామనుకున్నా. పరిస్థితి చూస్తుంటే మళ్లీ డీఎస్సీ ఉండేటట్లు లేదు. అందుకని నా ల క్ష్యాన్ని మార్చుకున్నాను. ఎంబీఏ, ఎంసీఏ వైపు చూస్తున్నా. డీఈడీ, బీఈడీ, పండిట్ శిక్షణ చేయడం మాత్రం వృథా అని కచ్చితంగా చెప్పవచ్చు. గతంలో వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉండేవి. ఇప్పుడవి లేవు. ప్రైవేటు వారు కూడా క్వాలిఫైడ్‌లను తీసుకుంటే ఎక్కువ  జీతం ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు.
 -  బండారు స్వాతి, విద్యార్థిని, శ్రీకాకుళం
 

మరిన్ని వార్తలు