బాబూ జాబెక్కడా..?

5 Sep, 2018 12:34 IST|Sakshi
నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగ యువత

గర్జించిన నిరుద్యోగులు

కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

ఎస్‌వీఎన్‌ కాలనీ : బాబూ జాబెక్కడా..?అంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని సూటిగా ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి యువత ఓట్లును రాబట్టుకున్న చంద్రబాబు, గద్దెనెక్కిన తరువాత యువతను నిరుద్యోగులను ఏమార్చుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన నిరుద్యోగులు, యువత, ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్‌ కేవీ.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువతపట్ల, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.

బాబు వస్తే జాబు వస్తుందని అందరూ నమ్మారని, చివరకు నిరుద్యోగులకు రూ.2వేలు నెలవారీ భృతి ప్రకటించి చేతులు దులుపుకున్నారన్నారు. తీరా ఇపుడు నాలుగేళ్లు గడిచిన తరువాత ముందస్తుగా ప్రకటించిన రూ.2వేలనూ రూ.వెయ్యికి కుదించి రాష్ట్రంలోని యువతను నిలువునా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటన చేసి పాలాభిషేకాలు చేయించుకున్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 33లక్షల మంది నిరుద్యోగులను మోసగించారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత యువతకు కనీస ప్రయోజనాలు దక్కలేదని, క్యాబినెట్‌ హామీ మేరకు 20వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగులకు ఆదుకునేలా ప్రకటన జారీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు.

పోరాటంతోనే సాధన...
మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శుల ఖాళీల భర్తీకై రాష్ట్ర మంత్రి లోకేష్‌బాబు 1500 పోస్టులు ఔట్‌సోర్సింగ్‌లో ఇస్తానని ప్రతిపాదించి జిల్లా కలెక్టర్‌లకు జీవోలు పంపారని వెల్లడించారు.  కేవలం నిరుద్యోగులు చేసిన ఆందోళనతోనే ఆ జీవో ఉపసంహరించి నోటిఫికేషన్‌కు సిద్ధమయ్యారన్నారు. పోరాటం చేయకుండా, ఉద్యమించకుండా ఏదీ సాధించలేమన్నారు. ç2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఏడాదికి ఒక డీఎస్సీ ఇస్తానన్నారని, ఇప్పటికీ కనీసం ఒక్క డీఎస్సీని ప్రకటించలేదన్నారు. డీఎస్సీలో 22వేల పోస్టులుంటాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ముందుగా ప్రకటించి  ఇపుడు వాటిని వెయ్యికి మాత్రమే పరిమితం చేశారన్నారు.  గ్రూప్‌2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌2లోనే కొనసాగించాలని, జీవో 622 రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్‌సి ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

కళ్లుండి చూడలేని ప్రభుత్వం
పట్టభధ్రుల ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళుతెరిచి రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను ఆలకించాలని, లేకుండా రానున్న ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సైతం దక్కని విధంగా ఓటమిని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కమిటి అధ్యక్షుడు పూర్ణ, కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి సవరం రోహిత్, ప్రజాసంఘాల నేతలు కుమ్మరి క్రాంతికుమార్, అంగిరేకుల వరప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ నేత భగవాన్‌దాస్, పీడీఎస్‌యు నేత గనిరాజు, దొంతా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా