ఈ రిజిస్ట్రేషన్‌తో ఉద్యోగాలకు మంగళం!

21 Aug, 2018 13:28 IST|Sakshi
జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన పేషెంట్‌ ఈ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌

ఆందోళనలో జీజీహెచ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది

ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్‌ పేరుతో కొత్తగా నియామకాలు

వేలల్లో ఖర్చుపెట్టి సర్టిఫికెట్స్‌ తెచ్చుకుంటున్న నిరుద్యోగులు

బాబు వస్తే జాబు వస్తుందని 2014 ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు.. బాబు వచ్చి నాలుగేళ్లు దాటింది.. ఆయన వస్తే జాబు రాకపోగా  ఏళ్లతరబడి పనిచేస్తున్న వారిని సైతం ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారంటూ గుంటూరు జీజీహెచ్‌లోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. ఏదో ఒకనాటికి పర్మినెంట్‌ చేస్తారని చాలీచాలని వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్నవారిని ఉన్నపళంగా పీకివేసే ప్రయత్నం చేస్తున్నారని వైద్య సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు మెడికల్‌: పేషెంట్‌ ఈ రిజిస్ట్రేషన్, ఫ్రం ట్‌ డెస్క్‌ మేనేజర్‌ పేరుతో ప్రభుత్వం నూతన పథకాన్ని ఆగస్టులో ప్రారంభించింది. టీచింగ్‌ ఆస్పత్రుల్లో మాత్రమే అమల్లోకి వచ్చే పేషెంట్‌ ఈ రిజిస్ట్రేషన్‌ పనులను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) కార్యాలయం వారు హైదరాబాద్‌ కు చెందిన నక్షత్ర కంపెనీ కాంట్రాక్టర్‌కు అప్పగిం చారు. సదరు కాంట్రాక్టర్‌ కొద్ది రోజులుగా గుం టూరు జీజీహెచ్‌లో పేషెంట్‌ ఈ రిజిస్ట్రేషన్‌ కౌం టర్‌లు ఏర్పాటు చేస్తూ వైద్య సిబ్బందిని రిక్రూట్‌ చేస్తున్నారు. మల్టీపర్పస్‌ సపోర్టివ్‌ వర్కర్స్‌ పేరుతో కాంట్రాక్టర్‌ సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుని రోగుల సేవలకు వారిని వినియోగించాల్సి ఉంది.

కాంట్రాక్టర్‌ ఇష్టమే..
కొద్ది రోజులుగా ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్‌తో ఉద్యోగాల నియామకాలు జరుగుతుండటంతో ఆస్పత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ వైద్య సిబ్బంది తమ ఉద్యోగాలు పోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి సంఘం, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా సుమారు 120 మంది అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతిలో జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చిన వేతనాల జీవో ప్రకారం వేతనాలు చెల్లించకుండా ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌ తనకు ఇష్టం వచ్చిన వారిని ఉద్యోగాల్లో తీసుకుంటారని, తాము ఏమీ చేయలేమని ఆస్పత్రి అధికారులు చెబుతూ ఉండటంపై కాంట్రాక్ట్‌ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.  జీజీహెచ్‌ 1954లో ప్రారంభమైన సమయంలో 600 మందిగా నాల్గోతరగతి ఉద్యోగుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. వారిలో చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయటం, కొంత మంది మరణించటంతో ప్రస్తుతం 150 మంది మాత్రమే  ఉన్నారు. కొంతకాలంగా నాల్గోతరగతి ఉద్యోగుల సంఘం నేతలు పోస్టులు భర్తీ చేయాలని, అధిక పనిభారంతో తాము ఇబ్బంది పడటమే కాకుండా రోగులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు.

తమ బంధువులను చేర్పించేందుకు యత్నం
ఏడాది కాలంగా ఆస్పత్రి అధికారులు ప్రభుత్వం నాల్గోతరగతి ఉద్యోగుల నియామకాలు చేస్తుం దంటూ గొప్పలు చెప్పారు. తీరా నేడు అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలను నియమించాలని నిర్ణయించటంతో ఉద్యోగుల సంఘం నేతలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కాగా కొంతమంది నాల్గోతరగతి ఉద్యోగులు తమ బంధువులను ఆస్పత్రిలో ఉద్యోగంలో చేర్పించేందుకు హైదరాబాద్‌ నుంచి ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్లు సైతం పదివేలు ఖర్చు పెట్టి తెప్పించుకున్నారు. నేడు కాంట్రాక్టర్‌ ఎవరిని రిక్రూట్‌ చేసుకుంటారో తెలియక ఆస్పత్రి అధికారులను, కార్యాలయ ఉద్యోగులను, వైద్యులను కలిసి తమకు ఉద్యోగం ఇప్పించేలా చూడాలని బతిమిలాడుకుంటున్నారు.

డీఎంఈ కార్యాలయ అధికారులనే అడగండి
కాంట్రాక్టర్‌ ఏ విధంగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటారో, ఏ పనులు చేస్తారో తమకు ఏమీ తెలియదని, డీఎంఈ కార్యాలయం అధికారులనే వివరాలు అడగాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు ‘సాక్షి’ వివరణ కోరగా తెలిపారు.

మరిన్ని వార్తలు