ఎన్నికలకు 6 నెలల ముందు.. 4 నెలల కోసం.. ఈ కంటి తుడుపు

3 Aug, 2018 03:43 IST|Sakshi

నిరుద్యోగ భృతికి 12 లక్షల మందే అర్హులని సర్కారు ప్రకటన

నెలకు కేవలం రూ.1,000 చొప్పున ఇస్తామని స్పష్టీకరణ

గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన వారికే ‘ముఖ్యమంత్రి యువనేస్తం’

వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సర్కారు ఎత్తుగడ

1.70 కోట్ల మంది ఆశలపై నీళ్లుచల్లిన తెలుగుదేశం ప్రభుత్వం

నెలకు రూ.2,000 చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో బాబు హామీ

చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం

వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.80 లక్షలకు చేరిన ఖాళీలు

20 వేల పోస్టులే భర్తీ చేస్తామన్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ‘‘నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం వచ్చేదాకా నెలకు అక్షరాలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా’’.. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా తిరుగుతూ ఇచ్చిన హామీ ఇది. టీడీపీ మేనిఫెస్టోలోనూ దీన్ని ప్రముఖంగా పొందుపర్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఊరూవాడా కరపత్రాలు కూడా పంచిపెట్టారు.

చంద్రబాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లు పూర్తయ్యా యి.ఇప్పటిదాకా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి సంగతే మర్చిపోయారు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తుండడంతో నిరుద్యోగులను మచ్చిక చేసుకుని, ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగులకు నెలకు కేవలం రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు.

ఎదురు చూపులన్నీ వృథా?
ఎన్నికల ముందు ఆరు నెలలపాటు కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.1,000 చొప్పున భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగ భృతికి నెలకు రూ.122 కోట్ల చొప్పున ఆరు నెలలకు రూ.732 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు.

కేవలం గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన వారికే భృతి ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు భృతి కోసం నాలుగున్నరేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, పలు ఆంక్షలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 12 లక్షల మందికి మాత్రమే భృతికి అర్హులని, అది కూడా నెలకు వెయ్యి రూపాయలే ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగులు కోటికి పైమాటే..
రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం... రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న 18–35 ఏళ్ల లోపు వారు కాకుండా ఎలాంటి ఉపాధి లేని వారు 65,01,846 మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం యువతీ యువకుల్లో 45 శాతం మంది ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.

చదువులు పూర్తి చేసుకున్నా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న వారి సంఖ్య 20,19,159. వీరంతా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివినవారే. ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువులు ఆపేసిన యువత 9,17,653 మంది ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న వారు 22,71,629 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.1.70 కోట్ల మంది నిరుద్యోగ భృతికి అర్హులే. కానీ, ప్రభుత్వం కేవలం 12 లక్షల మందికే భృతి ఇస్తామని చెప్పడం గమనార్హం. ప్రజా సాధికార సర్వేలో తేలిన 65 లక్షల మంది నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

గత ఆర్థిక సంవత్సరం (2017–18) వరకు నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం స్పందించలేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఆర్థిక సాయం పేరిట కేవలం రూ.500 కోట్లు కేటాయించారు. అందులో పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో (2018–19) ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది.

ఖాళీలు 1.80 లక్షలు.. భర్తీ చేసేది 20 వేలట!
రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నరేళ్లు అవుతున్నా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య ప్రస్తుతం 1.80 లక్షలకు చేరింది. అయితే, కేవలం 20 వేల పోస్టులనే భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. ఎన్నికల ముందు యువతను మభ్యపెట్టడానికే తప్ప కొలువులను పూర్తిగా భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని సాక్షాత్తూ అధికార వర్గాలే చెబుతున్నాయి. ఆదర్శ రైతులు, ‘104’ ఉద్యోగులు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లను చంద్రబాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 

మరిన్ని వార్తలు