నిరుద్యోగుల కలలు...కల్లలు!

16 Mar, 2019 09:41 IST|Sakshi

 చదువుకుంటే.. మంచి భవిష్యత్తు ఉంటుంది.  
 చదువుకుంటే.. కుటుంబానికి అండగా నిలబడొచ్చు. 
 చదువుకుంటే.. సమాజంలో ఒక గౌరవస్థానం ఉంటుంది. 
 చదువుకుంటే.. నలుగురికి చేతనైన∙సాయం చేయొచ్చు. 
 చదువుకుంటే.. నచ్చిన ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడొచ్చు
....ఇదీ నేటి యువత కల. అయితే ఈ ఐదేళ్లలో ఆ కలలు కల్లలయ్యాయి. ఎంత ఉన్నత చదువులు చదివినా కనీస ఉపాధి లేక కుటుంబానికి బరువై దయనీయ స్థితిలో రోజులు నెట్టకొస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులున్నా భర్తీ చేయడం లేదు.  ఏటా వేలల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంటున్న యువతకు ఉద్యోగాలు దొరకడం గగనమైపోతోంది. అందుకే ఏ చిన్న నోటిఫికేషన్‌ వెలువడినా లక్షల దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఏడో తరగతి అర్హత ఉన్న ప్రభుత్వ కొలువుకు బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసిన వారు  పోటీ పడుతున్నారు. మరోపైపు ప్రైవేటు రంగంలోనైనా ఉపాధి దొరకుతుందా అంటే అక్కడా పోటీ తీవ్రంగా ఉంది. ఒకవేళ దొరికినా అతి తక్కువ వేతనంతో నగరాల్లో పని చేయాలంటే చాలా కష్టం.  నచ్చిన ఉద్యోగ అవకాశం లేక, తల్లిదండ్రులకు భారం కాలేక యువత నరకయాతన అనుభవిస్తోంది. చివరకు ఉద్యోగార్హతకు వయసు మీరి జీవితంలో స్థిరపడలేక ఒత్తిడికి లోనవుతూ ఉరికొయ్యకు వేలాడుతోంది.


సాక్షి, అనంతపురం: ‘ఇంటికో ఉద్యోగం కల్పిస్తాం. నిరుద్యోగాన్ని రూపుమాపుతాం. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తాం. ఉద్యోగ సృష్టికర్తలుగా తయారుచేసి.. తద్వారా ఉద్యోగ కల్పనకు కృషి చేస్తాం. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ఒకవేళ ఉద్యోగం కల్పించకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం.’ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానాలు, హామీలు ఇవి.  వీటిని విన్న నిరుద్యోగులతోపాటు వారి  తల్లిదండ్రులూ చాలా సంతోషించారు. అయితే గద్దెనెక్కి న తర్వాత ఆ హామీలను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మాట దేవుడెరుగు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న వేలాది ఉద్యోగాలను ఊడబెరికారు. 


ఉన్నత చదువులు చదివి.. 
ఉన్నత చదువులతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని ఆశించిన యువతకు ప్రభుత్వ నిర్వాకంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులను ఎవరిని కదిలించినా వారి ఆవేదన వర్ణనాతీతం. బతుకులు బాగుపడుతాయని ఆశించి భంగపడ్డామని నిరుద్యోగులు వాపోతున్నారు. ఐదేళ్లు వేచి చూసినా.. ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోవడం తో ఉద్యోగార్హత వయసు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జీవితంలో స్థిరపడాల్సిన వయసులో ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు.  తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వయసులో ఇంకా వారి మీదే ఆధారపడి బతకాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. చదివిన కోర్సుకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేక రాజీపడి బతుకు బండిని లాగిస్తున్న పలువురి వేదన వారి మాటల్లోనే.. 

పోస్టుల భర్తీ ఏదీ? 
గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ పోస్టులు 950 భర్తీ చేసింది. అనంతరం గతేడాది 600 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఇంతవరకూ భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు.  గతంలో 450 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేశారు. తాజాగా 300 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలు గతంలో జిల్లాలో 90 పోస్టులు భర్తీ చేశారు. తాజాగా 40 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు.  చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆశపడ్డ అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదిలి కోచింగ్‌ సెంటర్లలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. అయితే హామీలన్నీ విస్మరించడంతో అటు ప్రైవేటు ఉద్యోగాలు చేయలేక, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాక రెండింటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామన్న వేదన నిరుద్యోగుల్లో  ఉంది.


ఈ చిత్రంలోని యువకుడి పేరు డాక్టర్‌ గణేష్‌కుమార్‌. కదిరికి చెందిన ఈయన కామర్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. నెట్‌ (జాతీయ అర్హత పరీక్ష), సెట్‌ (రాష్ట్ర అర్హత పరీక్ష) ఉత్తీర్ణత సాధించారు. పీడీఎఫ్‌ (పోస్ట్‌డాక్టరల్‌ ఫెలోఫిప్‌) పూర్తీ చేశాడు. ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కలలుకన్నాడు. అయితే అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం అతడి ఆశలు అడియాసలు చేస్తున్నాయి. అతడి తండ్రి కిడ్నీ పేషేంట్‌. ఏ పనీ చేయలేడు. ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి కదిరిలో మల్లెపూలు కట్టి కుటుంబానికి నెట్టుకొస్తోంది. గత ఐదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత్యంతరం లేక  కుటుంబ పోషణకు ఓ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేరాడు. 

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు జగదీష్‌. నార్పల గ్రామం. ఎంబీఏ పూర్తి చేశాడు. చదువు అయిపోగానే మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ 2014 ఎన్నికల సమయంలో  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడంతో తన భవిష్యత్తు బాగుపడుతుందని సంబరపడ్డాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. చివరకు నిరుద్యోగ భృతి కూడా అందకపోవడంతో కుటుంబపోషణ కోసం ఉపాధి కూలీ(జాబ్‌కార్డ్‌ నెం. 121712707004011932)గా మారాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలందరినీ మోసగించాడని జగదీష్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.    
 

మరిన్ని వార్తలు