ఇచట నిరుద్యోగులు...ఉద్యోగులుగా..

21 Jun, 2018 15:15 IST|Sakshi
శిక్షణకు హాజరైన విద్యార్థులు

సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్‌నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు.

                 స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు.

                 నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, వీఆర్‌ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్‌ నిర్వహించే గ్రూప్‌-సి, గ్రూప్‌-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్‌ బాబు తెలిపారు.

               అభ్యర్థులకు తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్‌(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు.

మరిన్ని వార్తలు