నిరుద్యోగులకు వరం ‘నవ గురుకుల్‌’

13 Jun, 2019 10:14 IST|Sakshi

రాష్ట్రంలో తొలిసారిగా శిక్షణ.. కొలువు 

15న ఎంపికలు

18–23 ఏళ్ల యువతకు అవకాశం

సాక్షి,కడప కోటిరెడ్డిసర్కిల్‌ : జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, బీ టెక్, ఎం టెక్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి వరం లాంటిది నవ గురుకుల్‌ సంస్థ. ప్రతిభగల కొంతమంది ఐటీ తదితర సంస్థల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారు ఇలాంటి సంస్థల్లో ఉపాధి పొందాలంటే ఉన్నత చదువులు ఉంటేనే కొలువులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సీ డ్యాప్‌ సంస్థ ద్వారా నవ గురుకుల్‌ అనే సంస్థను ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. ఈ సంస్థ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఆంగ్లంపై పట్టు ఉన్న వారికి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉన్నత కొలువులు రానున్నాయి.

జిల్లాలో ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువత ఉన్నత కొలువులు లేక చాలీచాలని జీతాలతో ఇబ్బందులుపడుతున్నారు. ఎన్నాళ్లు పని చేసినా జీతం తక్కువ రావడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 18–23 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు బంగారు భవిష్యత్‌ కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు నవ గురుకుల్‌ అనే సంస్థను ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. సీ డ్యాప్‌ (సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) ద్వారా జిల్లాలో ఎంపికలు నిర్వహించి నైపుణ్యం, క్రమశిక్షణ ఉన్న వారిని ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది దేశంలో 150 మంది యువతకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 50 మందికి అవకాశం కల్పించారు. తొలి దశలోనే జిల్లాకు 10 సీట్లు కేటాయించడంతో నిరుద్యోగులు స్వాగతిస్తున్నారు.

నిరుద్యోగులకు సువర్ణావకాశం
సీ డ్యాప్‌ సంస్థ ద్వారా నిర్వహించే ఎంపికల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తోంది. 18–23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ చదివిన వారికి అవకాశం.  ముందుగా అభ్యర్థుల విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆన్‌లైన్‌ ద్వారా నాలుగు విభాగాల్లో పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన వారికి నేరుగా సంస్థ నుంచి స్క్రైప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చివరి పరీక్ష, వీడియో కాలింగ్‌ ద్వారా మౌఖిక పరీక్షలు ఉంటాయి. వీటిలో ఎంపికైన మహిళా అభ్యర్థులకు బెంగళూరులో, పురుషులకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.

శిక్షణలో.. 
సీ డ్యాప్‌ సంస్థ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆయా సంస్థ సిబ్బంది బెంగళూరు, ధర్మశాల ప్రాంతాలకు తీసుకెతారు. వీరికి ఏడాదిపాటు శిక్షణనిస్తారు.  శిక్షణలో ప్రముఖ సంస్థలైన గుగూల్, టెక్‌ మహేంద్ర, ఆపిల్, ఐ ఫోన్‌ వంటి సంస్థలలో ట్రైనర్స్‌గా పనిచేస్తున్న వారు శిక్షణ ఇస్తారు. శిక్షణలో అభ్యర్థులకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఎలాంటి కోర్సులు ఉంటాయి.. వాటిని ఎలా నేర్చుకోవాల అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ఆంగ్లం, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుంది. ఏడాదిపాటు కొనసాగే శిక్షణలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తారు.

ఎంపికలు
ఈనెల 15న జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని టీటీడీసీలో  ఉదయం 10 గంటలకు నవ గురుకుల్‌ సంస్థలో కొలువుల కోసం ఎంపికలు జరుగుతాయి. ఎంపికకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఆధార్‌కార్డుతో హాజరు కావాలి. తుది ఎంపికలనంతరం 16న ఫైనల్‌ మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. 

నిరుద్యోగుల పాలిట వరం
సీ డ్యాప్‌ సంస్థ ద్వారా నిరుద్యోగ అభ్యర్థికి సీటు లభిస్తే తన జీవితం బంగారు మయమే. శిక్షణానంతరం వారికి వివిధ రకాల సంస్థల్లో దేశంలో ఎక్కడైనా ఉపాధి లభిస్తుంది. కనీసం రూ.30 వేలకుపైగా జీతభత్యాలు ఉంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉపాధి కల్పించడం శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
శివారెడ్డి, డీఏఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ, కడప 

మరిన్ని వార్తలు