ఎల్‌కేజీ విద్యార్థి అనుమానాస్పద మృతి

12 Nov, 2013 00:18 IST|Sakshi

సదాశివపేట, న్యూస్‌లైన్ : పట్టణ పరిధిలోని పిట్టలకేరిలో గల శ్రీకృష్ణవేణి టెక్నో పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న గణేష్ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సిదాపూర్ కాలనీకి చెందిన కృష్ణ, మాధవి దంపతుల కుమారుడు గణేష్ శ్రీకృష్ణవేణి టెక్నో పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఫిన్ బాక్స్ తీసుకుని భోజనం చేయడానికి వెళుతుండగా అకస్మాతుగా కింద పడి పోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పట్టణంలోని సూర్య నర్సింగ్ హోంకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తుండగా మృతి చెందాడు.
 
 విషయాన్ని ప్రిన్సిపాల్ రవీందర్‌రావు స్థానిక పోలీసులకు తెలిపి పాఠశాలకు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా.. విద్యార్థి గణేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఉపాధ్యాయుడు కొట్టినందు వల్లే గణేష్ మృతి చెందాడని ఆరోపించారు. అయితే జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరిస్తుండగా బాధిత తరఫు బంధువులు ప్రిన్సిపాల్ రవీందర్‌రావుపై దాడికి పాల్పడ్డారు. సీఐ దామోదర్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రావుతో పాటు సీఐటీ యూ డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతి చెందిన విద్యార్థి మృతదేహానికి పంచనామా నిర్వహించామన్నారు. గణేష్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ దామోదర్‌రెడ్డి తెలిపారు.
 
 విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశం
 సంగారెడ్డి మున్సిపాలిటీ  : సదాశివపేట పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థి మృతి చెందిన సంఘటనపై విచారణకు డిప్యూటీ ఈఓను ఆదేశించినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. సోమవారం పాఠశాలలో విద్యార్థి గణేష్ ఆకస్మికంగా మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు, బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నివేదిక ఆధారంగా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
 
 కొట్టడం వల్లే గణేష్ మృతి
 ఉపాధ్యాయులు కొట్టడం వల్లనే గణేష్ మృతి చెందాడు. కొట్టిన తరువాత సరైన సమయంలో వైద్య చికిత్సలు చేయించలేదు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గణేష్ చనిపోయాడు.
 - తల్లిదండ్రులు కృష్ణ, మాధవి
 
 ఉపాధ్యాయులు కొట్టలేదు
 ఎల్‌కేజీ చదువుతున్న విద్యార్థి గణేష్‌ను తమ ఉపాధ్యాయులు ఎవరు కొట్టలేదు. టిఫిన్ బాక్స్ తీసుకుని భోజనం చేయడానికి వెళుతూ కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందాడు.
 - ప్రిన్సిపాల్ రవీందర్‌రావు
 
 పాఠశాల గుర్తింపు రద్దుచేయాలి
 ఎల్‌కేజీ చదువుతున్న గణేష్ విద్యార్ధి మృుతికి కారణమైన కృష్ణవేణి టెక్నో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. విద్యార్థి కుటుంబానికి పాఠశాల యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
 - అనిల్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు