అకాల వర్షంతో అతలాకుతలం

3 Mar, 2014 01:58 IST|Sakshi
అకాల వర్షంతో అతలాకుతలం

పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. గాండ్లపెంట మండలంలో షెడ్డు గోడ కూలి ఒకరు మృతి చెందారు. అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

ఎన్‌పీకుంట మండలం పెడబల్లి రోడ్డులోని మదార్‌వలి, సక్కుబాయి, రహీం ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ధాన్యం, ఇతర వస్తువులు తడిచిపోయాయి. రెడ్డివారిపల్లి, చిన్నసానివారిపల్లి, ఎన్‌పీకుంట, దిగువపల్లి, నాయినివారిపల్లి తదితర గ్రామాల్లో సుమారు 40 ఎకరాల్లోని మొక్కజొన్న, 20 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 20 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రూ.20 లక్షల దాకా నష్టం సంభవించి ఉంటుందని రైతులు చెబుతున్నారు. బుక్కపట్నం
 

మండలం గశికవారిపల్లి, కొండాపురం, బోయముసలయ్యగారి పల్లి, చింతలయ్యగారిపల్లెల్లో దాదాపు 80 ఎకరాల్లోని మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. అధిక పెట్టుబడులు,అర కొర నీళ్లు, ఉండీ లేని కరెంటుతో అష్టకష్టాలు పడి సాగుచేసిన పంటలు గాలి, వానతో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు  ప్రతాప్‌రెడ్డి, నారాయణమ్మ, నారప్ప, జయరామిరెడ్డి తదితరులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కదిరికి చెందిన అస్లాం (52), అతని స్నేహితుడు సాధిక్ సహా సుమారు 20 మంది ఆదివారం వైఎస్సార్ జిల్లా వెలిగల్లులో జరిగిన వలిమా కార్యక్రమానికి ద్విచక్రవాహనాలపై వెళ్లారు. కార్యక్రమం అనంతరం  తిరిగి వస్తుండగా  హఠాత్తుగా గాలీవాన ప్రారంభమైంది.

 

దీంతో రక్షణ కోసం వారంతా రోడ్డు పక్కనే సుబాన్ కు చెందిన పొలంలో నిర్మిస్తున్న కోళ్ల షెడ్డులోకి వెళ్లారు. గాలి ఉధృతికి షెడ్డుపైనున్న రేకులు ఎగిరి పోవడంతో వారంతా బయటకు పరుగులు తీశారు. గోడ పక్కనే ఉన్న అస్లాం నుదిటిపై ఇనుప కమ్మీ పడడంతో తీవ్ర గాయమైంది. ఇంతలోనే షెడ్డు గోడ కూలి అతనిపై పడడంతో అక్కడిక క్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితుడు సాధిక్ కుడికాలు విరిగింది. డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషా, ఎస్‌ఐ రాఘవేంద్రప్ప సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లోంచి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి, కదిరి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి పరిశీలించారు. గాండ్లపెంటలో ఆదివారం రాత్రి 20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
 
 
 

మరిన్ని వార్తలు