మరోసారి మొండిచేయి

2 Feb, 2020 05:30 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తప్పని నిరాశ 

ఫలితంగా రూ.6,591 కోట్ల మేర కోత – వచ్చే ఆర్థిక ఏడాదికీ నిధుల శాతం తగ్గుదల

రూ.32,237 కోట్లు మాత్రమే కేటాయింపు 

ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాల గ్రాంటు ఊసేలేదు 

వైఎస్సార్‌ కడప స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్టణం లేదా రామాయపట్నం పోర్టు ప్రస్తావనే లేదు 

రాజధాని, వెనుకబడిన జిల్లాలు, పోలవరానికీ కేటాయింపుల్లేవు 

సెంట్రల్, గిరిజన వర్సిటీలకు అరకొరగా కేటాయింపులు 

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను తీవ్ర నిరుత్సాహపర్చింది. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని ఉండగా ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.34,833.18 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పుడు సవరించిన అంచనా మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.28,242.39 కోట్లేనని కేంద్రం పేర్కొంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి వస్తాయనుకున్న నిధుల్లో రూ.6,590.79 కోట్ల మేర కోత పడింది. మరోపక్క.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.11 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ.32,237.68 కోట్లు వస్తాయని కేంద్రం పేర్కొంది.  

రెవెన్యూ లోటు భర్తీ కూడా లేదు 
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వరుసగా ప్రతీ ఏడాది రెవెన్యూ లోటులో ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లపాటు కూడా రెవెన్యూ లోటులోనే ఉంటుందని.. ఇందుకు గ్రాంటును సిఫార్సు చేయాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,897 కోట్లు మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. కానీ, బడ్జెట్‌లో ఇందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. పలు సందర్భాల్లో ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్నా ఈసారి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి కేంద్రం తీవ్ర నిరాశే మిగిల్చింది.

పోలవరం, రాజధానికీ కేటాయింపుల్లేవు 
పోలవరం ప్రాజెక్టుకు గత ఆర్థిక ఏడాది (2018–19), ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. ఈ బడ్జెట్‌లోనూ మొండిచెయ్యే చూపింది. అలాగే.. 
- రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇవ్వగా ఇంకా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.  ఆ మొత్తాన్నీ బడ్జెట్‌లో పొందపర్చలేదు.  
రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా ఆ విషయాన్నీ బడ్జెట్‌లో అస్సలు ప్రస్తావించలేదు.  
దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, వైఎస్సార్‌ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ–చెన్నై కారిడార్, బెంగళూరు–చెన్నై కారిడార్‌ను కూడా కేంద్రం ఉసూరుమనిపించింది.

జాతీయ విద్యా సంస్థలకు అరకొరగా.. 
పునర్విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ విద్యా సంస్థలకు మాత్రం కేంద్రం అరకొరగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా.. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ వర్సిటీకి రూ.60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)కి రూ.31.82 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా నూతన ఐఐటీలకు రూ. 7,182 కోట్లు, ఐఐఎంలకు రూ. 476 కోట్లు, ఎన్‌ఐటీలకు రూ. 3,885 కోట్లు, ఐఐఎస్‌ఈఆర్‌ సంస్థలకు రూ. 896 కోట్లు, ఐఐఐటీలకు రూ. 226.35 కోట్లు కేటాయించారు. వీటిల్లోనే ఏపీలోని సంస్థలకు కూడా కలిసి ఉన్నాయని బడ్జెట్‌ అంచనాల్లో ప్రస్తావించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థలకూ నిర్ధిష్ట కేటాయింపులు చేయలేదు. అలాగే, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి.. పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీలను ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం.. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, ఎయిమ్స్‌కు నిర్ధిష్ట కేటాయింపుల్లేవు.
 
మౌలిక ప్రాజెక్టులు రాష్ట్రానికి చేరేనా? 
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు లక్ష్యంగా రూ.103 లక్షల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. వీటిలో రాష్ట్రాల వారీగా నిర్ధిష్ట వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే, తాజా బడ్జెట్‌లో రూ.1.72 లక్షల కోట్ల మేర రవాణా మౌలిక వసతుల స్థాపనకు వెచ్చిస్తామని ఆమె తెలిపారు. వీటిలో కూడా రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు రానున్నాయో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 200 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. సుదీర్ఘ కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది మేలు చేసే అవకాశంగా ఉంది. ఇలా మొత్తం మీద ఏ విధంగా చూసినా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   

పెద్దపీట వేయడమంటే ఇలాగేనా?  
2019–20లో సబ్సిడీలకు రూ.3,38,153.67 కోట్లు కేటాయిస్తే అందులో ఖర్చు చేసింది రూ.2,63,557.33 కోట్లు. 2020–21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ.2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించారు. దృష్టి సారించాల్సిన వ్యవసాయ యాంత్రీకరణను విస్మరించారు. విధాన పరమైన కేటాయింపులు పెంచకుండా కిసాన్‌ రైలు వేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా 26 లక్షల సోలార్‌ పుంపు సెట్లు ఏర్పాటు చేస్తామనడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా?  
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్, ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌  

మరిన్ని వార్తలు