ఏపీపై ఇదేం వివక్ష?

2 Feb, 2020 05:16 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, చిత్రంలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, అనూరాధ, మాధవి, తలారి రంగయ్య, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, సత్యవతి, వంగా గీత, లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి

వ్యవసాయాధారిత రాష్ట్రంపై చిన్నచూపు తగదు 

ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం బాధాకరం 

ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం 

రాష్ట్ర హక్కులు, వాటాను సాధించుకుంటాం 

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి

సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత రాష్ట్రంపై వివక్ష చూపడం సరైందికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూశామని అయితే ఆ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం అనంతరం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణంలో పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక లోటును నియంత్రించేందుకు ఆహార సబ్సిడీ, వ్యవసాయ రుణాలు మాఫీ చేయడాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని.. ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి దీనిని పరిశీలించాలన్నారు.

బడ్జెట్‌లో రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారని.. ఇందులో వివక్ష లేకుండా ఏపీ వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాన్‌ కెమికల్‌ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్‌ ఫర్టిలైజర్స్‌ను ప్రోత్సహించాలన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు కేటాయించడం మంచి విషయమన్నారు. పోలవరం చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. తీవ్ర నీటి ఎద్దటి ఉన్న 100 జిల్లాల్లో సమగ్ర నీటి సరఫరా పథకాలు అమలు చేస్తామన్నారని.. అందులో ఏపీకి కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఎంతో సాయం వస్తుందని ఎదురు చూశామని, అయితే కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర హక్కులు, వాటాను సాధించుకుంటామని విజయసాయిరెడ్డి వివరించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనాయకుడు పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వంగా గీత, తలారి రంగయ్య, బీవీ సత్యవతి, లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు