కోవిడ్‌–19 మరణాలు తగ్గించేలా చర్యలు

5 Jul, 2020 04:51 IST|Sakshi

కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపట్టండి

మాస్క్‌ ధరించని, భౌతిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకోండి

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ ఆదేశం    

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వల్ల చనిపోయే వారి సంఖ్య ఒక శాతానికంటే తక్కువగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు, వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గౌబ ఏమన్నారంటే.. 

► అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలి. 
► రెడ్‌ స్పాట్లుగా మారేందుకు అవకాశాలున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి.
► ఇంటి నుంచి బయిటకు వచ్చినçప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలి. 

భౌతిక దూరం పాటించాలి. 
► ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలి.
► కరోనా వైరస్‌ నియంత్రణకు ఆరోగ్య సేతు యాప్‌ వినియోగం వంటి ఇతర సాంకేతిక విధానాలను పూర్తిగా వినియోగించుకోవాలి.
► ఆస్పత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను ఉంచాలి.
► ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో 60 శాతం పైగా కోలుకునే వారి సంఖ్య పెరిగింది. దీనిని మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి.
► ప్రస్తుతం దేశంలో రోజుకు 2.50 లక్షల కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలి.
► కరోనా కట్టడికై సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికై ఇప్పటికే 2 కోట్లకు పైగా ఎన్‌–95 మాస్క్‌లను, పెద్ద సంఖ్యలో పీపీఈ కిట్లను సరఫరా చేయగా మరిన్ని సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.
► వివిధ రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు.
► వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యనార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.భాస్కర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు