ఏబీవీని విచారించండి

8 Mar, 2020 05:54 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్ర హోంశాఖ

ఇంటెలిజెన్స్‌ మాజీ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు ఆమోదం

ఏసీబీ దర్యాప్తునకు గ్రీన్‌ సిగ్నల్‌ 7వ తేదీలోగా చార్జిషీటు దాఖలు చేయాలని సూచన

ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు, డ్రోన్‌ కొనుగోళ్లలో ఏబీ చేతివాటం

ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘాకే కొనుగోలు చేశారని ఆరోపణలు

తీవ్ర నేరాలకు పాల్పడినట్లు కేంద్రం ప్రాథమిక నిర్ధారణ

సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్‌ మాజీ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ తదుపరి విచారణను చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏబీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తును చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నిగమ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. పోలీసు విభాగం ఆధునికీకరణ నిధులు దుర్వినియోగం, ఏరోసాట్, యూఏవీల కోనుగోళ్ల కోసం వెంకటేశ్వరావు వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై వచ్చే నెల 7వ తేదీలోగా చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 

ఏసీబీ విచారణ జరిపించండి..
– ఏబీ వెంకటేశ్వరరావు ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు, డ్రోన్లు కొనుగోలు చేయడంలో చేతివాటం చూపినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 
– ఆ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించింది. 
– వెంకటేశ్వరరావు దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. 
– పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్స్‌ విధానాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ఇండియన్‌ ప్రొటోకాల్‌ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  
– ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ను సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. 
– ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్‌ క్వార్టర్‌ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. 
– ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19వ తేదీన వెంకటేశ్వరరావు అక్రమాలపై సమగ్ర నివేదికను కేంద్ర హోం శాఖకు పంపించింది. 
– ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం శాఖ.. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినందున వెంకటేశ్వరరావుపై ఏసీబీ ద్వారా సవివరమైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు సంబంధించిన నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు