కిశోర్‌పై తిరుగుబావుటా!

21 Jan, 2014 02:07 IST|Sakshi
బొబ్బిలి, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై బొత్స వర్గం తిరుగుబావుటా  ఎగురవేసింది. ఒకే పార్టీలో ఉంటున్నా కొంత కాలంగా చాపకింద నీరులా వీరిద్దరి  మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. బొత్సను లక్ష్యంగా చేసుకొని ప్రతిసారీ కిశోర్ చంద్రదేవ్ మాటల యుద్ధం చేస్తుంటే,  ఇప్పుడు అదను దొరకడంతో బొత్స వర్గం కిశోర్‌పై అసంతృప్తిని వెళ్లగక్కింది. అందుకు జిల్లా కేంద్రంలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమమే వేదిక అయింది. ‘ఢిల్లీలోనే నిత్యం తిరుగుతున్న అరుకు ఎంపీ, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గల్లీలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ టిక్కెట్టు ఇవ్వకపోతేనే మంచిదని’ అదే పార్టీకి చెందిన నాయకులు జిల్లాకు వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు, ర్ణాటక ఎమ్మెల్సీ మానేకర్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి చినఅప్పలనాయుడు వద్ద కుండ బద్దలు కొట్టారు.  ఏడు జిల్లాలకు విస్తరించిన ఉన్న అరుకు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కోసం సోమవారం జిల్లా కేంద్రంలో రాహుల్ దూతలు అభిప్రాయ సేకరణ చేశారు.
 
  పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం అరుకు ఎంపీగా ఉన్న కేంద్రమంత్రిపై అభిప్రాయం అడిగేసరికి సాలూరుకు చెందిన నాయకులు ఒకే సారి ముక్త కంఠంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పారు.  ఎంపీ అయిన తరువాత, కేంద్ర మంత్రి పదవి వచ్చిన తరువాత అసలు కి శోర్ చేసిందేమీ లేదని, ఈ సారి టిక్కెట్టు ఇస్తే విజయం కష్టమని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా మంత్రి బొత్స, కిశోర్‌కు మధ్య ఎప్పటి నుంచోఅభిప్రాయ బేధాలున్నాయి.  దీంతో బొత్స వర్గం ఇప్పుడు కిశోర్‌కు వ్యతిరేకంగా గళమెత్తినట్టు  సమాచారం. సమైక్య రాష్ర్టం కోసం కూడా కిశోర్ పలు రకాలుగా వాదనలు వినిపించడం వల్ల వ్యతిరేకిత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితిల్లో టిక్కెట్టు ఇవ్వకపోవడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం. 
 
మరిన్ని వార్తలు