‘పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే’

12 Jul, 2018 22:13 IST|Sakshi

సాక్షి విశాఖపట్నం : పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదు.. దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రెండు రోజులు కోస్తాలో పర్యటనలో బిజీబిజీగా ఉన్న కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం పర్యటించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. అంతేకాక పోలవరం సివిల్ కన్‌స్ట్రక‌్షన్ పార్టును ఫిబ్రవరి 8 లోపల పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం కోసం భూ సేకరణ సమస్యగా ఉంది.. అందుకు కొన్ని ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.

‘పోలవరం భూ నిర్వాసితులు అభివృద్ధికి కేంద్రం చిత్త శుద్ధితో ఉంది. పోలవరం భూసేకరణపై కేంద్రానికి ఇచ్చిన మొదటి డీపీఆర్ కంటే ఇప్పుడు భూసేకరణ రెట్టింపు ఉంది. దీనిపై సొంత శాఖతో నివేదిక రప్పిస్తాం.1941లో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాకే పురోగతి వచ్చింది. అభివృద్ధికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది. రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టడం లేదు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. కేంద్రం వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. ఏపీ రైతాంగం ఆయిల్ సీడ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. మరో ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాలు చూస్తారు.అరబ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం కేంద్రం రూ. 8 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దానిని రూ. 2 లక్షల కోట్లకు తగ్గించాలని చూస్తున్నాం’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు