నాటకాలాడొద్దు

8 Feb, 2014 02:50 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా నాటకాలు ఆడుతూ తప్పించుకుంటున్న నాయకులపై వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసేందుకు కూడా వెనుకాడమని ఉద్యోగ సంఘం నాయకులు వెల్లడించారు. అవసరమైతే ఉద్యోగులతో రాజీనామా చేయించి నాయకులపై పోటీకి సిద్ధంగా వున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి జయరామప్ప తదితరులు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు ఉద్యోగులు విధులకు దూరంగా వుండటంతో జిల్లాలో రెండో రోజు కూడా కార్యాకలాపాలు స్తంభించిపోయాయి.
 
  సమైక్యాంద్ర కోసం ఉద్యోగాలను వదులుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నామని ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు దేవరాజు వెల్లడించారు. విభజన బిల్లు పార్లమెంట్ వరకు వెళ్తే ఉద్యోగుల సత్తా ఏంటో రుచి చూపిస్తామని ెహ చ్చరించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆశా నోడల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహిస్తున్న అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణప్పతో వాగ్వాదానికి దిగి సమావేశం నిర్వహించకుండా అడ్డుకున్నారు.
 
 శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి అనంతరం యూనివర్సిటీ ప్రధాన ముఖ ద్వారం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగేంతవరకూ ఉద్యమిస్తామని నీటి పారుదల శాఖ ఉద్యోగులు పిలుపునిచ్చారు. సమైక్యాంద్రకు మద్దతుగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలుగు జాతిని ఒక్కటిగానే ఉంచాలని పంచాయితీ రాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

 శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమైక్యాంధ్ర నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మూజువాణి ఓటుతో తిరస్కారానికి గురైన రాష్ట్ర విభజన బిల్లు మరెక్కడా ఆమోదం పొందడానికి వీలులేదని ఉద్యోగులు పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూత వేయించారు. కదిరి, హిందూపురం, రాయదుర్గం, పెనుకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు