సమైక్యవాదుల కన్నెర్ర

13 Feb, 2014 02:15 IST|Sakshi

వైవీయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్‌జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్‌జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్‌సర్కిల్‌లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్‌క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
 
 అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్‌నారాయణపై ఏపీభవన్‌లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులో ఎన్‌జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు.
 
 ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
 
 నేడు జిల్లా బంద్‌కు పిలుపు..
 పార్లమెంట్‌లో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
 
 నేడు వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్
 కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్:  ఆంధ్రప్రదేశ్  పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు.
 
 ప్రజల మనోభావాలు పట్టవా..!
 వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్‌జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్‌సర్కిల్‌లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు.
 
 వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌జీఓ నాయకులు గోపాల్‌రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్‌బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు