కన్నెర్ర

5 Oct, 2013 02:48 IST|Sakshi

సాక్షి, కడప :  జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శాంతియుతంగా 65 రోజులుగా కొనసాగుతున్న సమైక్య ఆందోళనలు ఒక్కసారిగా జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినేట్  ఆమోదించిందన్న వార్త జిల్లాలో ప్రకంపనలను సృష్టించింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలపై ఆగ్రహం క ట్టలు  తెంచుకునేలా చేసింది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎవరికి వారు  స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చారు. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామన్నారు.
 
 ఎక్కడికక్కడ రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బంద్‌తో జిల్లా వ్యాప్తంగా జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా ఓపీ వైద్య సేవలతోపాటు కూరగాయల అంగళ్లు లేకపోవడం,  ఆటోలు కూడా ఎక్కడా తిరగకపోవడం బంద్ తీవ్రతను తెలియజేస్తోంది.
 
  కడప నగరంలో సమైక్యవాదులు ఉదయం 6 గంటల నుంచే బంద్‌ను పర్యవేక్షించారు.  విష్ణుప్రియ, మయూర హోటళ్లపై దాడి చేశారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లోని  కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. డీసీసీ కార్యాలయంపై వైవీయూ విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
 
 దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ వైవీయూ విద్యార్థులు ఆకాశవాణి కేంద్రాన్ని ముట్టడించారు. డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి వ్యవహరించిన  తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అధికారులతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు బంద్‌ను పర్యవేక్షించాయి. కడప నగరంలో సాయంత్రం అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు ఉపాధ్యాయులు  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
 
  రాయచోటిలో సమైక్యవాదులు బంద్‌ను పర్యవేక్షించారు. దళిత ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మహిళా కండక్టర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా సాగింది.
  మైదుకూరు పట్టణంలోని నాలుగు వైపుల జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. ఉద్యోగ జేఏసీ బంద్‌ను పర్యవేక్షించింది. న్యాయవాదులు, ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  రైల్వేకోడూరులో జేఏసీ నేతృత్వంలో ఉపాధ్యాయులు రోడ్లపై నిలబడి నిరసన తెలిపారు. ముస్లింలు సోనియా, కేసీఆర్‌తోపాటు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు పాడె కట్టి సాయంత్రం ఐదు గంటల వరకు వైఎస్సార్ సర్కిల్‌లో ఉంచి నిరసన తెలుపుతూ దహన సంస్కారాలు చేపట్టారు. ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు.   ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు.
 
  జమ్మలమడుగులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్లపై టైర్లు, మొద్దులు కాలుస్తూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జేఏసీ నేతలు దొరబాబు, రవిబాబు నేతృత్వంలో బంద్‌ను పర్యవేక్షించారు.  ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు.
 
  బద్వేలులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ  నిర్వహించారు. పూర్తి స్థాయిలో బంద్ కొనసాగింది. మిద్దెలవారిపల్లె, కోటవీధికి చెందిన యువకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పోరుమామిళ్లలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతోపాటు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని రీతిలో బంద్  నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను సైతం తిరగనీయలేదు. ప్రయాణీకులకు ఇబ్బందిలేకుండా వంటా వార్పు చేపట్టి అన్నదానం చేశారు.
 
  రాజంపేటలో ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వందలాది వాహనాలు ఆగిపోయాయి. టీడీపీ ర్యాలీని ఎన్జీఓలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జెండాలు తీసేసి ఉద్యమంలోకి రావాలని ఎన్జీఓలు నినదించారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
 
 బంద్ విజయవంతంగా కొనసాగింది. ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్జీఓలు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో బంద్ జరిగింది. ఎన్జీఓ నాయకుడు పాపిరెడ్డిపై దాడికి నిరసనగా బంగారు దుకాణాల వద్ద ైబైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి స్థాయిలో వాహనాలను తిరగనీయలేదు.
 
 కమలాపురం పట్టణంలో జేఏసీ నేతలు రామ్మోహన్, జాఫర్ సాదిక్, ఎస్.వెంకట రమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టైర్లు, మొద్దులు తగులబెట్టి ఆటోలను సైతం తిరగనీయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
 
  పులివెందులలో ఉద్యోగ జేఏసీ, జేఎన్‌టీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో కర్రసాము విన్యాసాలు చేపట్టారు. సోనియా, బొత్స, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు