సమైక్యానికి సపోర్టు

9 Aug, 2013 02:51 IST|Sakshi

 కాకినాడ, న్యూస్‌లైన్ : రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు... రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని లారీ వర్కర్లు... బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు... ఎగుమతి, దిగుమతులతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం చేసే ఎక్స్‌పోర్టర్లు... ఇలా అన్నివర్గాలు ఏకతాటిపై నిలిచి సమైక్యరాగాన్ని అందుకున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం ఉదయం నుంచి 24 గంటల బంద్‌కు కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. పోర్టు ఆధారిత వర్గాలన్నీ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా సమైక్యాంధ్ర కోసం సమైక్య ఉద్యమబాట పట్టి మిగిలిన సంఘాలకు స్ఫూర్తిగా నిలిచారు. పోర్టు కార్మికులు, లారీ ఓనర్లు, ఎక్స్‌పోర్టర్లు, బాడ్జీ యజమానులతో సహా అన్నివర్గాలు స్వచ్ఛంద బంద్ పాటించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా చాంబర్ పిలుపు మేరకు కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాన నగేష్ ఆధ్వర్యంలో దాదాపు రెండువేల లారీలను పూర్తిగా నిలిపివేశారు.
 
  సీరియల్‌ను కూడా రద్దు చేయడంతో రేవుతోపాటు ఇతర రవాణా కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. మరో వైపు బార్జీలపై పనిచేసే సరంగులు, కళాసీలు, లారీలపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఎగుమతి, దిగుమతుల్లో పనిచేసే కార్మికులు వెరసి దాదాపు 15వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. పనికి వెళ్లకపోతే రోజు గడవని స్థితిలో కూడా సమైక్యాంధ్రకు కోసం ఒక్కరోజు పనిలేకపోయినా ఇబ్బంది లేదని, అవసరమైతే మరింతగా ఉద్యమించడానికి కూడా సిద్ధమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉంటే పోర్టు రవాణాలో కీలకంగా వ్యవహరించే స్టీల్‌బార్జీలు కూడా ఎక్కడికక్కడే నిలిపివేశారు. 89 బార్జీలు ఆగిపోయాయి. రేవు కార్యకలాపాలు నిలిచిన సందర్భంగా నిత్యం వేలాదిమంది కార్మికులతో కళకళలాడుతూ కనిపించే యాంకరేజ్‌పోర్టు ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. బంద్ ప్రభావంతో ఎగుమతి, దిగుమతులు, కార్మికుల వేతనాలు, ఓడలు, రైల్వే రాక్‌ల డెమరేజ్, లారీల అద్దెలు ద్వారా ఒక్కరోజుకు దాదాపు రూ.10 కోట్లు మేరకు నష్టం వాటిల్లిందని రేవు ఆధారిత వర్గాలు చెప్పాయి.
 
 భారీ ర్యాలీ
 సమైక్యాంధ్ర కోరుతూ కోకనాడ చాంబర్ కార్యాలయం నుంచి సినిమారోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా జగన్నాధపురం వంతెన వరకు భారీ ర్యాలీ చేశారు. కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ 1953లో మద్రాస్ నుంచి తట్టాబుట్టతో వెళ్లగొట్టారని, ఇప్పుడు 2013లో అటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకునేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా ఉద్యమాన్ని చూసైనా ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో షోర్‌లేబర్ యూనియన్ అధ్యక్షుడు తలాటం వీరబాబు, స్టీవ్‌డోర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పితాని నూకరాజు, క్లియరెన్స్ అండ్ ఫార్వర్డింగ్ (సీఅండ్ ఆఫ్) ఏజెంట్ల ప్రతినిధి పీవీ రావు, ఏవీ రంగారావు, రాఘవులు, రావిపాటి రామ్‌గోపాల్, స్టీవ్‌డోర్ ఓనర్స్ అధ్యక్షుడు మహేష్, లారీ వర్కర్స్ యూనియన్‌అధ్యక్షుడు బుద్ధన బాబ్జి, స్టీల్ బార్జీ ప్రతినిధి అనుబాబుతో సహా పెద్దసంఖ్యలో హాజరయ్యారు.      
 

మరిన్ని వార్తలు