వర్సిటీ నిర్మాణం.. ఎడతెగని జాప్యం

9 Aug, 2015 01:51 IST|Sakshi

 మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ భవనాల నిర్మాణం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటం లేదు. భూమి పరీక్షలు తదితర కారణాలు చూపి ఏళ్లతరబడి భవనాల నిర్మాణం చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాల భూమిని ప్రభుత్వం యూనివర్సిటీకి 2010లో కేటాయించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం రూ.72 కోట్లతో అంచనాలు రూపొందించారు. 2014 అక్టోబరులో ఈ పనులను విజయవాడకు చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి అప్పగించారు.

అక్టోబరులో ఈ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగిస్తూ మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును అప్పట్లో అందజేశారు. ఇక్కడ రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనాలను నిర్మించాలని అంచనాలు రూపొందించారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు.

జీ+2 భవనాలు నిర్మించాలని నమూనాలు తయారుచేయగా మొదటి విడతలో జీ+1 భవనాల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టుగా ఉండటంతో ఇటీవల రూ.50 లక్షల వ్యయంతో కొంతమేర భూమిని మెరక చేశారు. దీంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా అంతర్గత రోడ్లను మెరక చేయించారు. సీపీడబ్ల్యూడీకి ఈ పనులు అప్పగించిన అనంతరం 18 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు టెండర్ల దశను దాటకపోవటం గమనార్హం.

 భూమి పరీక్షల పేరుతో జాప్యం
 2010లో కృష్ణా యూనివర్సిటీకి రుద్రవరం వద్ద 102 ఎకరాలను కేటాయించారు. ఈ భూముల పక్కనే ఉన్న గురుకుల జూనియర్ కళాశాలకు మూడంతస్తుల భవనాలను ఇటీవలే నిర్మించారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణం విషయంలో భూమి పరీక్షలు చేస్తున్నామని, భూమి లోపల మట్టి మెత్తగా ఉండి బరువును తట్టుకునేందుకు అవకాశం లేదని తదితర కారణాలు చూపి భవనాల నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తున్నారు.

తొలుత భూమి లోపల 100 అడుగుల లోతు నుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ భవనాలు నిర్మించడానికి అనుకూలంగానే ఉందని తేల్చారు. అయితే మూడు, నాలుగు అంతస్తులు నిర్మిస్తే త్వరితగతిన భవనాలు పాడైపోయే అవకాశం ఉన్నందున నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గిలకలదిండి హార్బర్‌ను నిర్మించిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం.

 ఇన్ని భూమి పరీక్షలు చేసి నివేదికలు సమర్పించినా సీపీడబ్ల్యూ అధికారులు ఇంతవరకు ఈ పనులకు టెండర్లు పిలవకపోటవం గమనార్హం. వారం రోజుల క్రితం కృష్ణా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ డి.సూర్యచంద్రరావు సీపీడబ్ల్యూ అధికారులతో మాట్లాడి ఈ పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కృష్ణా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రావాలంటే టెండర్ల దశ పూర్తవ్వాలని యూనివర్సిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
 
2008 నుంచి అద్దె భవనాల్లోనే...
 2008 ఏప్రిల్ 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా యూనివర్సిటీని ప్రారంభించారు. ఆంధ్ర జాతీయ కళాశాలలోని 20 గదుల్లో నిర్మలా కాన్వెంట్ సమీపంలోని ఓ భవనంలో యూనివర్సిటీని అద్దెకు నడుపుతున్నారు. వర్సిటీకి హాస్టళ్ల సదుపాయం లేకపోవటం, రీసెర్చ్ స్కాలర్స్‌కు వసతి లేకపోవటం తదితర కారణాల నేపథ్యంలో ఇది ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా యూనివర్సిటీకి అత్యంత ప్రాధాన్యత సమకూరినా భవనాలు నిర్మించకుండా జాప్యం చేయటం గమనార్హం.

మరిన్ని వార్తలు