తిరుమలలో వదిలేశారు..

5 Nov, 2014 04:14 IST|Sakshi
తిరుమలలో వదిలేశారు..

ఆడబిడ్డ పుట్టిందని పేగుబంధం తెంచుకున్నారు

ఆడ బిడ్డ. నెల కూడా నిండలేదు. వెలుగును కూడా చూడలేని కళ్లు. ముద్దుగొలిపే మోము. ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో? జగాన్ని ఏలే ఆ దేవదేవుని చెంత వదిలి వెళ్లింది. పారిశుద్ధ్య కార్మికురాలు ఆ బిడ్డను స్టేషన్‌కు చేర్చారు. అమ్మలా లాలించారు. ఆప్యాయతను పంచారు. ఈ ఘటన తిరుమలలో మంగళవారం చూపరులను కంటతడి పెట్టించింది.
 
సాక్షి, తిరుమల:  తిరుమల 481 ఏఎన్‌సీకాటేజీ మెట్లకింద మంగళవారం నెల రోజులు నిండని ఆడబిడ్డను ఎవరో వదలి వెళ్లారు. బిడ్డ ఏడుస్తుండడంతో  ఈ ఘటన వెలుగుచూసింది. బిడ్డ ఏడుపు విని ఏఎన్‌సీ కాటేజీ వద్ద శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు రామలక్ష్మీ కాటేజీ మెట్ల వద్దకు వెళ్లింది. అక్కడ చీర, తువాలు మాత్రమే చుట్టి ఉంచిన నెలకూడా నిండని ఆడబిడ్డ కనిపించింది. చర్మంపొట్టు కూడా రాలనిస్థితిలో ఉన్న ఆ పసికందు వెక్కివెక్కి ఏడుస్తుండడంతో ఆ కార్మికురాలు చలించిపోయారు. చుట్టూ వెతి కినా కన్నవారెవరూ కనిపించలేదు.

విజిలెన్స్ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ పసికందును తిరుమలలోని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బిడ్డ అవసరాలను తీర్చారు.   హ గ్గీస్ తొడిగారు. కొత్త  పాలసీసా తెప్పించి వెచ్చని పాలు పట్టించారు. వెచ్చగా ఉండే ఉన్ని బట్టలు, గ్లౌజ్ లు తొడిగారు. అమ్మకు దూరమైనా పారిశుద్ధ్య కార్మికురాలు రామలక్ష్మీ అన్నీ తానై సపర్యలు చేశారు. ఆకలి తీరడం, ఉన్ని దు స్తుల వెచ్చదనంలో తల్లిలా లాలించిన రామలక్ష్మి ఒడిలోనే ఆ పసికందు హాయి గా నిద్రపోయింది.

ఆడబిడ్డ కావడంతోనే కన్నవారు వది లిపెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తు న్నారు. బిడ్డను చిత్తూరులోని  శిశువిహార్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. ఆ  కాటేజీలో  లలిత పేరుతో ఒక మహిళ గది పొందారని, సెల్‌ఫోన్ నెంబరు తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు