ఎవరా నలుగురు..?

20 Mar, 2020 11:28 IST|Sakshi
వ్యాపారి ఇంటి ముందు తిరుగుతున్న దుండగులు

బంగారు వ్యాపారి ఇంట్లోకి పట్టపగలే చొరబడే యత్నం

సుమారు 15 నిమిషాల పాటు నలుగురు దుండగులు రెక్కీ

పట్టణంలో హల్‌చల్‌ చేసిన దొంగలు

ఆందోళన చెందుతున్న బంగారు వ్యాపారులు

పసిడిపురి..పుత్తడిపురం ఈ రెండు పేర్లు వినగానే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. బంగారు వ్యాపారంలో రాష్ట్రంలోనే గాక దేశ వ్యాప్తంగా ప్రొద్దుటూరుకు మంచి పేరుంది. బంగారు వ్యాపారులే గాక ఇతర రంగాల్లో బాగా స్థిరపడిన వారు అనేక మంది సంపన్నులు ఇక్కడ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇక్కడి నుంచే అప్పుగా డబ్బు తీసుకుంటాయి. విడుదలయ్యే ప్రతి చిత్రంలోనూ ప్రొద్దుటూరు ఫైనాన్సియర్ల పెట్టుబడులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతలు సైతం రుణం ఇక్కడి వారి నుంచే తీసుకుంటుంటారు. అలాంటి పసిడిపురిపై ఇటీవల దొంగల కన్ను పడినట్లు కనిపిస్తోంది.

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : బంగారు  వ్యాపారస్తులను టార్గెట్‌ చేసుకొని గతంలో ఈ పట్టణంలో పలు దొంగ తనాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు దుండగులు ఒక బంగారు వ్యాపారి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో పట్టపగలు వచ్చిన దుండగులు వీధిలోనూ, ఇంటి చుట్టూ సుమారు 15 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించడంతో బంగారు వ్యాపారులు, ఇతరులు ఆందోళన చెందుతున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు షావలి స్కూల్‌ కాలనీలో ఒక బంగారు వ్యాపారి నివసిస్తున్నాడు. అతను దర్గాబజార్‌లో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7న నలుగురు వ్యక్తులు కారులో అతను ఉన్న కాలనీకి వచ్చారు. వారి కారును కాలనీ ప్రధాన గేటు వద్ద నిలిపారు. ఒక వ్యక్తి అక్కడే నిలబడగా ఇద్దరు వ్యక్తులు కాలనీ లోపలికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి వెనుక వైపు వెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు వ్యాపారి కాంపౌండ్‌లోకి వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కారు. ఆ ఇంటికి ప్రధాన తలుపునకు ముందు భాగాన గ్రిల్స్‌ అమర్చిన తలుపులు కూడా ఉన్నాయి.

ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో యజమాని పేరు పెట్టి దుండగులు పిలిచారు. ఆయన భార్య ప్రధాన ద్వారం తెరచి చూడగా ఎప్పుడూ చూడని ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు. ‘ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు’ అని అడుగగా పలకలేదు వారు. ముందు తలుపు తీయమని దబాయించారు. అనుమానం వచ్చిన ఆమె గ్రిల్స్‌ తలుపులు తీయలేదు. సుమారు 10 నిమిషాల సేపు అక్కడే  ఉన్న  నలుగురు దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నలుగురు కాలనీ కాంపౌండ్‌లో ఉన్నంత సేపు ఫోన్లలో మాట్లాడుకుంటూ కనిపించారు. బంగారు వ్యాపారి ఎంతో కష్టపడి ఆ ప్రాంతంలో ఉన్న  ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. అందులో దుండగులు సెల్‌ఫోన్‌లో మాట్లాడిన సన్నివేశాలు టైమింగ్‌తో సహా రికార్డు అయ్యాయి. సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ నలుగురు ఎవరు..? వారు ఎవరితో మాట్లాడారనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు జాకెట్‌ వేసుకొని వచ్చారు. వేసవి కాలంలో జాకెట్‌ వేసుకొని రావడం చూస్తే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

రింగ్‌ రోడ్డు గుండా వచ్చారు..
జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులోని రింగురోడ్డు  గుండా నలుగురు దుండగులు పట్టణంలోకి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. పెన్నానగర్‌ నుంచి నేరుగా వ్యాపారి ఉంటున్న కాలనీ వద్దకు వచ్చారు. అతని ఇంటి వద్ద నుంచి వెళ్లి  ఇంటర్నేషనల్‌ ఫంక్షన్‌ హాల్‌  వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కొంత సేపు కారు పార్కింగ్‌ చేశారు. తర్వాత వన్‌టౌన్‌ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోయారు. వారు మాట్లాడిన భాష.. యాస ఆధారంగా వారు ఉత్తరప్రదేశ్‌ లేదా బీహార్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.

నలుగురు ఎందుకొచ్చినట్లు..
వ్యాపారి ఉంటున్న కాలనీలో సంపన్నులు చాలా మంది ఉన్నారు. నేరుగా అతని ఇంటికే వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చోరీ చేయడానికే వచ్చారను కుంటే.. అదే వీధిలో సుమారు 15 రోజుల నుంచి ఒక ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటికి  వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఉన్న ఇంటినే ఎందుకు టార్గెట్‌ చేశారనేది తెలియడం లేదు. పట్టపగలు భయపెట్టి దోచుకొని వెళ్లడానికా.. లేక కిడ్నాప్‌ చేయడానికి ప్లాన్‌ వేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నలుగురు దుండగులకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన రహదారిలో కాకుండా చిన్న పాటి ఇరుకు వీధి నుంచి నేరుగా వ్యాపారి ఇంటికి వచ్చిన విధానం చూస్తే స్థానికులు ఎవరైనా వారికి సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం బంగారు మార్కెట్‌లో తెలియడంతో వ్యాపారులు భయాందోనలు చెందుతున్నారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలోనూ సీసీ కెమెరాలను అమర్చారు. ఇంత పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థ ఉన్నా దుండగులు ఎలా వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. కారు నెంబర్‌ ప్లేట్‌ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. ఫేక్‌ నెంబర్‌ వేసుకొని దుండగులు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై వ్యాపారి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల వైఎంఆర్‌ కాలనీలో రెండు భారీ చోరీలు జరిగాయి. ఒకటి  ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేసే ఉద్యోగి ఇంట్లో, మరొకటి గనుల వ్యాపారి ఇంట్లో దొంగలు పడ్డారు. వీటిలో ఒక చోరీ ఘటనలో పురోగతి కనిపించగా ఇంకోటి ఇంత వరకు తేలలేదు.

మరిన్ని వార్తలు