ఆధ్యాత్మిక కేంద్రంలో.. అలజడి

23 Jan, 2020 13:17 IST|Sakshi
పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విగ్రహాలు

విధ్వంసం పని అదృశ్య శక్తులదేనా?

పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం

ఎనిమిది ఆలయాల్లో 12 విగ్రహాలను ధ్వంసం చేసిన అగంతకులు

కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సంఘటనపై ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఖండన

దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశం

తూర్పుగోదావరి, పిఠాపురం: ఆధ్యాత్మిక కేంద్రం. అనేక ప్రాచీన ఆలయాలకు నిలయమైన పిఠాపురంలో హిందూ దేవాలయాలపై కుట్రలు జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దొరికిన చోటల్లా కనిపించిన ప్రతి హిందూ దేవతల విగ్రహాన్ని ఇష్టమొచ్చినట్టు ధ్వంసం చేసిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే పిఠాపురంలో అలజడులు సృష్టించడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ విధ్వంసం వెనుక అదృశ్య శక్తులున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పశువుల సంత వరకు ఉన్న ఎనిమిది ఆలయాలకు చెందిన 12 హిందూ దేవతల విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. పట్టణంలో ఉప్పాడ బస్టాండ్‌ నుంచి ఉన్న రామకోవెలల వద్ద బయట ఉన్న వివిధ దేవతామూర్తుల టైల్స్‌ బొమ్మలను విరగ్గొట్టిన అగంతకులు దొరికిన చోటల్లా విధ్వంసం సృష్టించారు. ఆలయాల వద్ద ఉన్న ఫ్లెక్సీలతో పాటు వైఎస్సార్‌ సీపీకి చెందిన ఫ్లెక్సీలను, ఆలయాల గోడలకు ఉన్న టైల్స్‌ బొమ్మలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంఘటన స్థలాలను క్లూస్‌టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూపరిషత్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పిఠాపురంలో ధర్నా నిర్వహించారు. పిఠాపురం సీఐ అప్పారావు సంఘటన స్థలాలను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో నేరస్తులను పట్టుకుంటామని ఎటువంటి అలజడులకు గురికావద్దని పట్టణ వాసులకు విజ్ఞప్తి చేశారు.

సీసీ కెమెరాల పరిశీలన
విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు వ్యాపార సంస్థల సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించినా ఫలితం కనిపించలేదంటున్నారు. వాస్తవానికి గతంలో పట్టణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. కానీ ఎక్కడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ సంఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సీసీ కెమెరాలు ఉండి ఉంటే కచ్చితంగా దోషుల వివరాలు తెలిసి ఉండేవి.

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
విగ్రహాల ధ్వంసం ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు పోలీసు అ«ధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన జరిగిన సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గతంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

రాత్రి గస్తీ ఏమైనట్టు..?
పట్టణంలో మెయిన్‌ రోడ్డులో ఇంత దారుణంగా అనేక విగ్రహాలను పగుల గొట్టినా గస్తీలో ఉన్న పోలీసులు ఏమి చేస్తున్నారని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తుండగా ఆ సమయంలో గస్తీ తిరగాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు