చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

26 Aug, 2013 04:04 IST|Sakshi
చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అనంతరం రివాల్వర్‌తో కాల్చిచంపారు. భార్యాపిల్లలూ ఎవరూ లేని, ఫుట్‌పాత్‌పైనే నివసించే వృద్ధుడిని కాల్చిచంపడం పలు సందేహాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతికి ఇది నిదర్శనమనే విమర్శలూ వస్తున్నాయి.


 పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటకలోని బీదర్‌కు చెందిన పట్టనీకార్ అశోక్ (65) బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నివసిస్తున్నాడు. పదేళ్ల కింద అశోక్‌తో గొడవ పడిన భార్య మున్నీ తమ ముగ్గురు పిల్లలతో సహా నిజామాబాద్ వెళ్లిపోయింది.
 
 ఆ తరువాత అశోక్ అమీర్‌పేట చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై చిన్న దుకాణం పెట్టుకుని చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన అశోక్ సంపాదనంతా దానికే ఖర్చుచేసేవాడు. రాత్రిపూట ఫుట్‌పాత్ పైనే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అమీర్‌పేట లీలానగర్‌లోని శాంతి శిఖర అపార్ట్‌మెంట్స్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న తన స్నేహితుడు లక్ష్మణ్‌కు చెందిన చెప్పుల దుకాణం ముందు నిద్రించాడు. అయితే.. తెల్లవారుజామున వాకింగ్‌చేస్తూ బయటకు వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు.. అశోక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అశోక్‌ను ఎవరో దుండగులు తుపాకీతో కాల్చినట్లుగా గుర్తించారు. అనంతరం వచ్చిన క్లూస్‌టీమ్ నిపుణులు ‘పాయింట్ 32’ క్యాలిబర్ తూటా ఖాళీ కాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
 తూటా గాయాన్ని బట్టి అశోక్ కూర్చుని ఉన్న సందర్భంలో వెనుక వైపు నుంచి కాల్చినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ హత్య కేసును కొలిక్కి తేవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రివాల్వర్ లెసైన్స్ ఉన్న వారెవరైనా పరీక్షించి చూసేందుకు ఈ పని చేశారా? లేదా అసాంఘిక శక్తులు ఉన్మాదంతో కాల్పులు జరిపాయా? వేరే వ్యక్తిగా పొరబడి అతడిని కాల్చారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు అశోక్ స్వస్థలం బీదర్ కావడంతో.. అక్కడి నేపథ్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పోస్ట్‌మార్టంలో అశోక్ మృతదేహం నుంచి బుల్లెట్‌ను వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 

>
మరిన్ని వార్తలు