అమ్మ ప్రేమకు ప్రతిరూపం

8 Mar, 2018 12:47 IST|Sakshi
మద్దూరులో తల్లిదండ్రులు, అక్క పిల్లలతో శాంతకుమారి

అక్క బిడ్డలే ఆమెకు సర్వస్వం 16 ఏళ్ల పాటు

కంటికి రెప్పలా సాకిన వైనం

అంగన్‌వాడీ టీచర్‌గా విధుల నిర్వహణ

పెళ్లి చేసుకోకుండా పిల్లలే లోకంగా కాలం వెళ్లదీస్తున్న శాంతకుమారి

కొవ్వూరు రూరల్‌ : అమ్మ.. అంటేనే త్యాగం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శాంతకుమారి. తనకు ఎంతో ఇష్టమయిన పిన్నికూతురు (వరుసకు అక్క) ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమెకున్న ఇద్దరు పిల్లలూ అనాథలుగా మిగిలారు. అంతే క్షణం ఆలోచించకుండా ఆమె వారిని అక్కున చేర్చుకుంది. సమాజం ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని.. పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. ‘అమ్మ’.. అన్న ఆ పిల్లల పిలుపులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ 16 ఏళ్లు గడిపేసింది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోన్న ఆ మహిళ వివరాలు ఆమె మాటల్లోనే..

‘నా పేరు నేతుల శాంతకుమారి. మాది కొవ్వూరు మండలం మద్దూరు. నేను ప్రస్తుతం గ్రామంలోనే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు నేతుల రూతమ్మ, గమరిఏలు. నాన్న దైవసేవ చేసేవారు. ఈ క్రమంలో మా పిన్ని కూతురు రాణికి మద్దూరులోనే సంబంధం చూసి అమ్మా నాన్న పెళ్లి చేశారు. వారి సంసారం సుమారు ఐదేళ్లు సాఫీగానే సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్ని కారణాలతో మా అక్క రాణి 16 ఏళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి వారి పిల్లలు దివ్యతేజకు మూడేళ్లు, రాజబాబుకు 6 నెలలు. తండ్రి పిల్లలను పట్టించుకోలేదు. అప్పటికి సమారు నాకు 22 ఏళ్లు. అక్క రాణి నాతో చాలా బాగా ఉండేది. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం.

ఆ ప్రేమతోనే నేను అక్క పిల్లలను చేరదీశాను. అప్పుడే అంగన్‌వాడీలో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ పిల్లలే జీవితం అనుకున్నాను. ఈ క్రమంలో పెళ్లి ప్రసక్తి పక్కన బెట్టాను. ఇంట్లో ఎవరూ వత్తిడి చేయకపోయినా, బంధువులు, స్నేహితులు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అయినా నేను పిల్లలే లోకం అనుకున్నాను. ఇప్పుడు రాజబాబుకు 17 ఏళ్లు. మద్దూరు హైస్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు దివ్యతేజ 10వ తరగతి వరకూ చదివి ఆపేసింది. వాళ్లే నా సర్వస్వం.. నాకు వాళ్లను చూస్తుంటే నా పిల్లలుగానే అనిపిస్తారు. వాళ్లూ అలానే ఉంటారు. అందుకే ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేశానని అనిపించదు. కంటేనే తల్లి అనుకుంటే ఎలా.. మనసు ఉంటే ఎవరైనా మన పిల్లలే.. నా శక్తి మేరకు వాళ్ల కోసం ఇంకా కష్టపడతాను.’ 

మరిన్ని వార్తలు