'సారో'దయ ఆంధ్రప్రదేశ్‌!

31 Dec, 2018 04:14 IST|Sakshi

పల్లెల్లో కార్చిచ్చు రేపుతున్న బెల్టు షాపులు 

కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యం రక్కసి 

అధికారికంగా మద్యం షాపులు 4,380.. 

అనధికారికంగా 40 వేలు 

రాష్ట్రంలో పెరిగిన కాపు సారా తయారీ గ్రామాల సంఖ్య 

మొక్కుబడిగా ‘నవోదయం’ పథకం 

ఈ చిత్రంలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన యువకుడి పేరు.. అబ్దుల్‌ హమీద్‌. కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌కు చెందిన అబ్దుల్‌ లారీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈనెల 5 రాత్రి ఓ ఉత్సవంలో గొడవపడుతున్న స్నేహితులను వారించేందుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్నవారు విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో హమీద్‌ (27) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఐదేళ్లలోపు చిన్నారులు కావడంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోయారు. మద్యం మనుషుల్లో విచక్షణను చంపేస్తుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.

సాక్షి, అమరావతి: ‘సూర్యోదయ’ ఆంధ్రప్రదేశ్‌.. ఇది ఏపీ సర్కారు ప్రచార నినాదం. దీని సంగతేమో కానీ.. ‘సారో’దయ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం వర్థిల్లుతోంది. మూడు మద్యం షాపులు.. ఆరు బెల్టు షాపులు.. అన్న రీతిలో మద్యం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో తాగునీరు దొరకని గ్రామాలున్నాయి కానీ.. మద్యం దొరకని గ్రామాలు లేవు. టీడీపీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఊరూరా.. వీధివీధిన మద్యం షాపుల్ని ఏర్పాటు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో బార్ల సంఖ్యను పెంచి ప్రతి వంద మందికి 13 నుంచి 15 మందిని తాగుబోతుల్ని చేస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన అయితే అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా మద్యం లభిస్తోంది. జాతీయ/రాష్ట్ర రహదారుల పక్కన మద్యం షాపులను ఎత్తేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వమే గండికొడుతోంది. ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రసంగంలో మద్యం షాపుల్ని రహదారుల వెంబడి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పుతో తమ ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారంటే ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తోందని తేటతెల్లమవుతోంది. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తామని మరో మంత్రి జవహర్‌ ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. మద్యం ఆదాయం కోసం కారాడుతూ ఆవాస ప్రాంతాలు, నివాస గృహాలు, చివరకు తినుబండారాలు అమ్మే దుకాణాల్లోనూ బెల్టు షాపులను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు.  

అటకెక్కిన నవోదయం 
టీడీపీ అధికారంలోకొచ్చేనాటికి రాష్ట్రంలో నాటు సారా తయారీ గ్రామాల సంఖ్య.. 1,942. ఈ సంఖ్య నాలుగున్నరేళ్లలో నాలుగు వేలకు చేరినట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మారుస్తామని 2016, ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రకటించి ‘నవోదయం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు దశల్లో ఈ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా.. అబ్కారీ శాఖలో ప్రతి ఉద్యోగి కాపు సారా గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి శనివారం ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సారా తయారీదారులు, విక్రేతలను గుర్తించి కేసులు నమోదు చేయాలి. సారా తయారీదారు, ముడి పదార్ధాలను అందించేవారిపై సీఆర్‌పీసీ చట్టం ప్రకారం బాండ్లను తీసుకోవాలి. అయితే మొదట్లో హడావుడి చేసిన ఎక్సైజ్‌ యంత్రాంగం ఆ తర్వాత ‘నవోదయం’ పథకాన్ని అటకెక్కించింది. కాపు సారా తయారీదారులపై దాడులు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రంలో మారుమూల, అటవీ ప్రాంతాల్లో కూడా కాపు సారా దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సారా విక్రయాలు ఊపందుకున్నాయి. నవోదయం మొదటి దశలో.. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కృష్ణా, విజయనగరం జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కానీ కృష్ణా, విజయనగరం జిల్లాలను ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. నవోదయం రెండో దశలో.. తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పి ఏడాది దాటుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో కాపు సారా ఇంకా కుటీర పరిశ్రమగానే కొనసాగుతోంది.  

‘తూర్పు’లోనే ఎక్కువ 
రాష్ట్రంలో ప్రధానంగా సారా తయారీ, అమ్మకాలు తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రోజుకు ఈ జిల్లాలో సగటున ఐదు లక్షల లీటర్ల సారా తయారవుతున్నట్లు అంచనా. ఈ జిల్లాలో పదివేల కుటుంబాలు సారా తయారీపై ఆధారపడి ఉన్నట్లు ఎక్సైజ్‌ వర్గాలే చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల లీటర్ల పరిమాణం గల సారా బట్టీలు పల్లెల్లో ఉన్నట్లు సమాచారం. గుంటూరు–నల్గొండ జిల్లాల సరిహద్దులోని కృష్ణా నదీ తీర ప్రాంతంలోని గ్రామాల్లో కూడా యథేచ్ఛగా సారా తయారవుతోంది. కర్నూలు జిల్లా సంజామల మండలం కుందూ నదీ తీర ప్రాంతంలోనూ సారా తయారుచేస్తున్నారు. ఈ జిల్లాలోని కొలిమిగుండ్ల, బనగానపల్లె నుంచి వైఎస్సార్‌ జిల్లాలో జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతాలకు సారా సరఫరా చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు, బేతంచర్ల, ప్యాపిలి అటవీ ప్రాంతాల్లోనూ జోరుగా సారా వ్యాపారం జరుగుతోంది. అదేవిధంగా కృష్ణా జిల్లా మైలవరం, రెడ్డిగూడెం తండాల్లో నాటు సారా తయారవుతోంది. సారా తయారీలో విషతుల్య పదార్ధాలను వినియోగిస్తున్నారు. బెల్లంతోపాటు పాత రబ్బర్లు, చెప్పులు, తుమ్మ, చెడిపోయిన బ్యాటరీలు, సల్ఫర్‌ వంటివి వాడుతున్నారు. కొందరైతే కిక్కు కోసం మిథైల్‌ ఆల్కహాల్‌ను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

బాబు అధికారంలోకి రాగానే బెల్టు షాపులు 
1990వ దశకంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ అనే మహిళ ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై చివరకు మద్యపాన నిషేధానికి దారి తీసింది. ఆ తర్వాత 1995లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారు. దీంతో వాడవాడలా బెల్టు షాపులు వెలిశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తాను చేసిన సంతకాన్నే మరిచిపోయి బెల్టు షాపుల్ని వీధివీధినా ఏర్పాటు చేసేలా మద్యం సిండికేట్లకు ఊతమిచ్చారు. పైగా మద్యం గోడౌన్ల సంఖ్యను పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి.  

మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నం 
మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన కోలాబత్తుల శ్రీనివాసరావు (44) కుటుంబంలో విషాదం నింపింది. శ్రీనివాసరావు రోజువారి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసై 2015, మార్చిలో మృత్యువాత పడ్డాడు. దీంతో అతని కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భార్య ఆదిలక్ష్మి కుటుంబ పోషణ భుజాన వేసుకుని రెండు నెలల క్రితం గల్ఫ్‌ వెళ్లింది. 7, 8 తరగతులు చదువుతున్న పిల్లలిద్దరినీ నాయనమ్మ వెంకటనర్సమ్మ తనకు వచ్చే పింఛన్‌ డబ్బులతో పోషిస్తోంది. కొడుకు తాగుడుకు అలవాటు పడడం తమల్ని దిక్కులేనివాళ్లను చేసిందని తల్లి వెంకటనర్సమ్మ కన్నీటిపర్యంతమవుతోంది. ఇదేవిధంగా కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బిలేహాలుకు చెందిన లక్ష్మమ్మ భర్త గత ఐదేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కనీసం నడిచి గడప దాటలేని పరిస్థితి. వీరికున్న రెండెకరాల పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. కానీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కుటుంబాలను మద్యం రక్కసి కాటేసింది.  

దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నాం 
మద్యానికి బానిసై నా భర్త అకస్మాత్తుగా మృతి చెందాడు. మా కుటుంబాన్ని ఆదుకునేవారు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పాచి పనులు చేసుకొని జీవిస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాప ఏడో తరగతి, చిన్నపాప నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని పోషించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం నుంచి నాకు ఏవిధమైన సహాయం అందలేదు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 
– కొణిదల వీరలక్ష్మి, రాజమహేంద్రవరం

కుటుంబాలు నాశనమవుతున్నాయి 
చంద్రబాబు గత ఎన్నికల సమయంలో మద్యపానాన్ని నియంత్రిస్తానని చెప్పడం వల్లే మహిళలు అధిక సంఖ్యలో ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విచ్చలవిడి చేశారు. ఇంటింటికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ఎన్నో రకాల మార్గాలుండగా మద్యం అమ్మకాలను ఆదాయంగా చేసుకోవడం దారుణం. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్య నియంత్రణ చేస్తానని చెప్పడాన్ని మంచి పరిణామంగా భావిస్తున్నాం.  
– ఇల్లూరి లక్ష్మిశేషు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు, ఒంగోలు 

కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు 
రోజూ సాయంత్రం మగాళ్లు తాము సంపాదించిన డబ్బు తీసుకొచ్చి తాగేస్తున్నారు. అరకొరగా మిగిలే డబ్బులే ఇంట్లో మహిళలకు ఇస్తున్నారు. ఇక ఆ ఇల్లాలు పిల్లల కడుపు ఎలా నింపుతుంది? టీడీపీ అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కానీ ఎక్కడా అమలు కాలేదు సరికదా గ్రామాల్లో వీధికో బెల్ట్‌షాపు వెలిసింది. పేదల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు తాగుబోతులైతే రాష్ట్రం అభివృద్ది చెందుతుందా? నివాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తే పేదలు, «మధ్యతరగతి ప్రజలు ఏమైపోతారో తెలియదా? ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం అమ్మకాలను దశల వారీగా అరికడతామంటున్నారు. ఆయన చేసి చూపుతారనే నమ్మకం ఉంది. 
– చల్లారి రాజ్యలక్ష్మి, ఐద్వా నాయకురాలు, ఏలూరు 

మద్యంతో ఆర్థికంగా చితికిపోయాం 
మా నాన్న పేరు.. చిన్న ఆంజనేయ. తాగుడుకు అలవాటు పడి లివర్‌ వ్యాధితో చనిపోయాడు. మా అమ్మ లక్ష్మీదేవి భవన నిర్మాణ పనులు చేస్తూ మమ్మల్ని సాకింది. తినడానికి తిండి కూడా లభించని దుస్థితిలో బడికి పంపకుండా నన్ను, నా సోదరుడిని పనులకు తీసుకెళ్లింది. కూలికి పోతేనే తిండి.. లేదంటే లేదు. దుర్భర జీవితం గడుపుతున్నాం. ప్రభుత్వం మద్యనిషేధం చేసి మా పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాలి.  
–బాబు, పత్తికొండ, కర్నూలు జిల్లా  

మరిన్ని వార్తలు