ఇదెక్కడి చోద్యం..!

8 Sep, 2014 02:30 IST|Sakshi
  •      చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్నది నిబంధన
  •      ఆ నిబంధనను తుంగలో తొక్కిన ప్రభుత్వం..
  •      రెండేళ్లుగా రైతులకు బకాయిలు చెల్లించని దుస్థితి
  •      కేన్ కమిషనర్ బెన్‌హర్‌ఎక్క ప్రతిపాదనను బుట్టదాఖలు చేయడంపై చెరకు రైతు కన్నెర్ర
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి:  చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్న నిబంధన అమలుకు ప్రభుత్వం నీళ్లొదిలింది. రైతుకు టన్నుకు రూ.300 చొప్పున ప్రోత్సాహంగా చెల్లించడాన్ని రెండేళ్లుగా దాటవేస్తోంది. చెరకు ఉత్పత్తి వ్యయం రెట్టింపైన నేపథ్యంలో రైతుకు టన్నుకు రూ.2,600 చొప్పున ఇవ్వాలన్న కేన్ కమిషనర్ బెన్‌హర్‌ఎక్క ప్రతిపాదనను సైతం బుట్టదాఖలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరుబాట పట్టేందుకు చెరకు రైతులు సిద్ధమవుతున్నారు.
     
    జిల్లాలో చెరకు 25,724 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం(ఎస్వీ షుగర్స్), చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం(చిత్తూరు షుగర్స్)తోపాటూ మరో రెండు ప్రైవేటు చక్కెర కార్మాగారాలు జిల్లాలో ఉన్నాయి. కర్మాగారాలకు చెరకు తోలిన 15 రోజుల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలన్నది నిబంధన. కానీ.. ఆ నిబంధనను ప్రైవేటు కర్మాగారాలతోపాటూ సహకార కార్మాగారాలు, ప్రభుత్వం కూడా తుంగలో తొక్కుతున్నాయి.

    2012-13, 2013-14 క్రషింగ్ సీజన్‌లో టన్నుకు రూ.1,800 చొప్పున చక్కెర కర్మాగారాలు.. రూ.మూడు వందల చొప్పున ప్రోత్సాహం గా ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. ఎస్వీ షుగర్స్ 2012-13 సీజన్‌లో 1,41,162 టన్నులు, 2013-14 సీజన్‌లో 1,22,681 టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. చిత్తూరు షుగర్స్‌లో 2012-13లో 44 వేల టన్నులు, 2013-14లో 22 వేల టన్నులు క్రషింగ్ చేశారు. టన్నుకు రూ.1800 చొప్పున చక్కెర కర్మాగారాలు కిందా మీదా పడి చెల్లించాయి. కానీ.. టన్నుకు రూ.300 చొప్పున చెల్లించాల్సిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోంది.
     
    బకాయిల చెల్లింపుపై స్పష్టత ఏదీ..?


    ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.9.54 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.93 కోట్లు మొత్తం రూ.18.47 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. బకాయిలు చెల్లించాలని రైతులు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా చలనం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో ఇదే అంశాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దాటవేశారు
     
    కేన్ కమిషనర్ ప్రతిపాదన ఏమైంది..?

    చెరకు ఉత్పత్తి వ్యయం రెట్టింపైంది. కానీ.. చెరకుకు కనీస మద్దతు ధర మాత్రం పెంచడం లేదు. ఇదే అంశాన్ని నవంబర్ 20, 2012న జిల్లా పర్యటనకు వచ్చిన కేన్ కమిషనర్ బెనహర్‌ఎక్క దృష్టికి చెరకు రైతులు తీసుకెళ్లారు.
     
    రైతుల వాదనతో ఏకీభవించిన కేన్ కమిషనర్.. చెరకు టన్నుకు రూ.2,600 చొప్పున కనీస మద్దతు ధరగా రైతులకు చెల్లించాలని ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను అమలుచేయాలని రైతులు పట్టుబడుతున్నారు. టన్నుకు రూ.2,600 చొప్పున కనీస మద్దతు ధరను 2012-13 క్రషింగ్ సీజన్ నుంచి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధరగా రూ.2,600ను పరిగణనలోకి తీసుకుంటే.. జిల్లాలో 27 వేల మంది చెరకు రైతులకు రూ.45 కోట్లను ప్రభుత్వం బకాయి పడింది. ఆ రూ.45 కోట్లను తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కలవాలని చెరకు రైతులు నిర్ణయించారు. కలెక్టర్ స్పందనను బట్టి ఉద్యమానికి సిద్ధం కావాలని రైతులు భావిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు