పెద్దల అండతోనే కుట్ర ‘కత్తి’కి పదును!

5 Nov, 2018 03:13 IST|Sakshi
నిందితుడు శ్రీనివాసరావు

సీఎంవో.. వెలగపూడి.. హర్షవర్ధన్‌.. శ్రీనివాస్‌

నిందితుడు పని చేసిన రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరికి ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం 

రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని సీఎంవో సిఫార్సు 

ఆఫీస్‌ బేరర్ల వ్యతిరేకంతో ఆగిన నియామకం 

పాఠశాలల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని అతనికి కట్టబెట్టాలని చినబాబు ఆదేశం 

అంగీకరించిన విద్యాశాఖ... హర్షవర్ధన్‌ గుప్పిట్లోకి క్రీడల సమాఖ్య 

విశాఖపట్నం నుంచి సాక్షి  ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పకడ్బందీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు పదును పెట్టిన తీరు కరుడుగట్టిన కిరాయి హంతక ముఠాల తీరును తలదన్నుతోంది. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో ఈ ఏడాది జనవరి నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్‌ యజమాని, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైంది.

హర్షవర్దన్‌ను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సిఫార్సు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు గట్టిగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ఆయనకు కట్టబెట్టినట్లు తాజాగా బయటపడింది. విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్‌ గదిని హర్షవర్దన్‌కు కార్యాలయంగా కేటాయించడం గమనార్హం. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా? అని విశాఖ జిల్లా ఒలంపిక్‌ సంఘం ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

పాఠశాలల క్రీడలు ఆయన గుప్పిట్లోనే...
ప్రభుత్వ పెద్దల అండతోనే విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్‌ లీజును హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి దక్కించుకున్నట్ల ఇప్పటికే బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడిగా నియమించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సు చేయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు గట్టిగా అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు ఆయనకు కట్టబెట్టేశారు. విశాఖపట్నం జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ను కాదని హర్షవర్థన్‌ ప్రసాద్‌ విడిగా ఓ సంఘాన్ని స్థాపించారు.  జిల్లాలోని 24 క్రీడా సంఘాల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ గుర్తింపు పొందిన ఒలంపిక్‌ సంఘం ఆధ్వర్యంలోనే ఉన్నాయి.

ఆ సంఘాలన్నీ హర్షవర్థన్‌ను వ్యతిరేకించాయి. దాంతో ఆయన వ్యూహాత్మకంగా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా వేడుకలపై కన్నేశారు. పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఎందుకంటే ఆ సమాఖ్య ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలు నిర్వహిస్తారు. సీఎం కప్‌ పేరిట నిర్వహించే ఆ క్రీడలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్ర, జిల్లా ఒలంపిక్‌ సంఘాల గుర్తింపు లేని హర్షవర్థన్‌ నెలకొల్పిన సంఘానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకూడదు. కానీ, దీన్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పాఠశాలల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్‌ నిర్వహిస్తున్న సంఘానికి కట్టబెట్టాలని రాష్ట్ర విద్యా శాఖను చినబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దాంతో పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్‌ నిర్వహిస్తున్న సంఘానికి అప్పగించారు. 

నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు 
పాఠశాల క్రీడల సమాఖ్య నిర్వహణను హర్షవర్థన్‌ తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్‌ గదిని ఆయనకు కార్యాలయంగా కేటాయించారు. వాస్తవానికి పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. క్రీడల నిర్వహణపై డీఈవో అక్కడే సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలి. కానీ, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని స్వర్ణ భారతి స్టేడియంలోని హర్షవర్థన్‌ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం గమనార్హం. పాఠశాల క్రీడల సమాఖ్యలో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అత్యంత కీలకం.

క్రీడల నిర్వహణ, నిధుల వినియోగం అంతా ఆయనే నిర్వర్తించాలి. అందుకే జిల్లాలో అత్యంత సీనియర్‌ అయిన పీఈటీకి ఆ పదవి ఇవ్వాలని కచ్చితమైన నిబంధన ఉంది. కానీ, హర్షవర్దన్‌ అదేమీ పట్టించుకోలేదు. సీనియర్లను కాదని తనకు సన్నిహితుడైన జూనియర్‌ పీఈటీ లలిత్‌కుమార్‌ను కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ సమాఖ్య ఈ ఏడాది విశాఖపట్నంలో 12 రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయని ఒలంపిక్‌ సంఘం ప్రతినిధులు మొత్తుకున్నా విద్యాశాఖ పట్టించుకోలేదు. 

ఇంతటి కుట్ర ఉందా? 
‘‘నిబంధనలను బేఖాతరు చేస్తూ హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరికి ప్రభుత్వ పెద్దలు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటా అని అప్పట్లోనే సందేహం కలిగింది. ఆయన రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టడంతో అసలు విషయం అర్థమవుతోంది. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా?’’ అని విశాఖపట్నం జిల్లా ఒలంపిక్‌ సంఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. 

‘బాస్‌’ భారీగా డబ్బులిచ్చాడు 
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభిమాని అని, అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇళ్లు కేటాయించిందని, ఆ ఇళ్ల వద్దకు చేరుకోవడానికి ప్రత్యేకంగా రోడ్డు కూడా వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌ ప్రసాద్‌ చౌదరి కోడిపందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కోళ్లకు కత్తులు కట్టే శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతడిని ఈ ఏడాది జనవరిలో విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో చేర్చుకున్నారు. నిందితుడికి హర్షవర్దన్‌ చౌదరి అందరికంటే ఎక్కువ వేతనం చెల్లించడంతోపాటు ఇంటి అద్దెను కూడా భరించినట్లు ఇప్పటికే బయటపడింది. కుట్రలో భాగంగా అప్పుడే అతడు విమానాశ్రయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా రెస్టారెంట్‌ యజమాన్యం సహకారంతో ఇతర సరుకులతోపాటు కత్తిని తీసుకొచ్చాడు. రహస్య ప్రదేశంలో దాన్ని దాచిపెట్టాడు.

ఇంతలో అసలు సూత్రధారులతో కాస్త విభేదాలు తలెత్తడంతో ఉద్యోగం మానేస్తానని శ్రీనివాసరావు వెళ్లిపోతే బతిమిలాడి మరీ పిలిపించుకున్నారు. ఆ సందర్భంగానే ముందుగా కుదుర్చుకున్న ‘డీల్‌’ కంటే అదనంగా మరిన్ని డిమాండ్లను శ్రీనివాసరావు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కుట్ర సూత్రదారులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాలు గుర్తించాయి. ఆ ధీమాతోనే జగన్‌పై హత్యాయత్నానికి 10 రోజుల ముందు శ్రీనివాసరావు తన స్వగ్రామం ఠానేలంకలో స్నేహితులకు ఇచ్చి ఖరీదైన విందు ఇచ్చాడు. కోటి రూపాయలతో నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు సైతం సాగించాడు. రెస్టారెంట్‌లో పనిచేసే సాధారణ వ్యక్తి అంత భారీ మొత్తంతో భూమి కొనుగోలుకు ప్రయత్నించడం ఏమిటన్నది సందేహాస్పదంగా మారింది. ‘బాసే’ తనకు అంత డబ్బు ఇచ్చాడని శ్రీనివాసరావు వ్యాఖ్యానించినట్లు ఠానేలంక గ్రామస్తులు చెబుతున్నారు. అంటే అప్పటికే నిందితుడికి సూత్రధారులు భారీ మొత్తం ముట్టజెప్పినట్లు స్పష్టమవుతోంది. జగన్‌పై హత్యాయత్నం కుట్రలో శ్రీనివాసరావుకు సూత్రదారులు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. 

మరిన్ని వార్తలు