అనూహ్య స్పందన

15 Oct, 2014 01:51 IST|Sakshi
అనూహ్య స్పందన

విద్యానగర్(గుంటూరు):
 వారంరోజులుగా గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎంపికలు మంగళవారం ముగిశాయి. ఇప్పటివరకు మొత్తం 22 వేల మంది హాజరయ్యారు. చివరిరోజు మంగళవారం గుంటూరు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టుల ఎంపికలకు ప్రక్రియలో పాల్గొన్నారు.

  సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం పరుగు, ఫిజికల్ టె స్ట్‌లు నిర్వహించారు. పరుగుపందెంలో 2,538 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 145 మంది నిర్ణీత దూరాన్ని సరైన సమయంలో చేరుకున్నారు. వారికి లాంగ్‌జంప్, పుల్‌అప్స్ పోటీలు నిర్వహించారు. తర్వాత వీరికి మెడికల్ పరీక్షలు జరుగుతాయి.

  వారంరోజులుగా జరుగుతున్న ఫిజికల్ టె స్ట్‌ల్లో ఎంపికైన 806 మంది అభ్యర్థులకు మంగళవారం మెడికల్ టె స్ట్‌లు నిర్వహించారు. అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉన్న 404 మందిని రాత పరీక్షలకు ఎంపిక చేశారు. చిన్నపాటి ఆరోగ్యరుగ్మతలున్న దాదాపు 68 మందిని చికిత్సల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ మెడికల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

  మంగళవారం చివరిరోజు నిర్వహించిన ట్రేడ్‌మెన్ పోస్టులకు తుది పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 1,500 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 224 మంది మెడికల్ పరీక్షలకు ఎంపికయ్యారు. ట్రేడ్‌మెన్ పోస్టులకు పారిశుధ్య కార్మికులకు ఊడ్చే పరీక్షలు, దోబీలకు దుస్తులు ఉతకటం, ఇస్త్రీ చేయటం, బార్బర్‌లకు కటింగ్, తదితర పోటీలు నిర్వహించారు. అనతరం విజేతలుగా నిలిచిన వారిని మెడికల్ టెస్టులకు ఎంపిక చేశారు.

  మెడికల్ టెస్టులకు ఎంపికైన అభ్యర్థులు బుధవారం నగరంలోని శ్యామలానగర్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయంలో ఉదయం 6గంటలకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయానికి రావాలని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాప్రి తెలిపారు.

  పోటీలు ముగియడంతో బీఆర్ స్టేడియంలో టెంట్లను తొలగించారు.

మరిన్ని వార్తలు