గుర్తింపు లేకుంటే మూసివేత

27 May, 2015 23:44 IST|Sakshi
గుర్తింపు లేకుంటే మూసివేత

- జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలలు
- నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ
- జూన్ 15వరకూ గుర్తింపునకు గడువు
- జాగ్రత్త వహించాలని
- తల్లితండ్రులలకు డీఈఓ హితవు
- సాక్షితో డీఈఓ కృష్ణారెడ్డి    
 
ఇవి తప్పనిసరి
- పాఠశాల ప్రభుత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు నోటీస్‌బోర్డ్‌లో పెట్టాలి.
- విద్యాశాఖ నిబంధనలు అమలు చేస్తునట్టుస్పష్టత ఇవ్వాలి.
- స్కూల్ ఆవరణలో అనధికారకంగా విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రిని అమ్మకాలు జరపరాదు.
- స్కూల్ బస్‌లకు సామర్థ్య సర్టిఫికెట్ ఉండాలి.

 
విశాఖ ఎడ్యుకేషన్ : వచ్చే విద్యాసంవత్సరానికి జిల్లా విద్యాశాఖ గుర్తింపు లేని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది.  ఇప్పటికే గుర్తింపు లేని పాఠశాలలకు నిబంధనలతో కూడిన నోటీసులు జారీ చేసింది. స్కూళ్లు తెరిచేలోగా నోటీసులకు లోబడి  గుర్తింపు పొందని పక్షంలో సీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గుర్తింపుకి నోచుకొని పాఠశాలల గురించి, విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న నిబంధనల గురించి ఆయన సాక్షికి తెలియజేశారు.

గుర్తింపులేనివి చాలా :జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో 65 ఉన్నత పాఠశాలలు, 74 ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఉన్నాయి. గతేడాది అన్ని ప్రయివేట్ పాఠశాలలకు నోటీసులు జారీ చేయగా 63 పాఠశాల యాజమాన్యాలు తమకు తాముగా స్కూల్స్‌ని మూసివేశాయి. మిగిలినవారు ప్రభుత్వ గుర్తింపు పొందారు. ఇప్పటికీ చాలా పాఠశాలలు గుర్తింపు లేకుండా ఉన్నట్లు సర్వేలో తేలింది.‘ఇలాంటి విద్యాసంస్థలన్నింటికి నోటీసులు జారీ చేశాం. జూన్ 15 వరకు గడువిచ్చాం. ఈ లోపు ప్రభుత్వ గుర్తింపు పొందడం లేకుంటే పాఠశాలలను రద్దు చేస్తామని’ కృష్ణారెడ్డి చెప్పారు. అలా చేయని పక్షంలో లక్ష రూపాయలతోపాటు రోజుకు రూ. 10 వేలు చెల్లించి స్కూల్‌ని నడపడానికి కొన్ని రోజులు వ్యవధి ఇస్తామన్నారు. అప్పటికి గుర్తింపు నమోదు చేసుకోకుంటే స్కూల్‌ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

పిల్లలను జాయిన్ చేసే సమయంలో కచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు ధ్రువపత్రం ఉందో లేదో పరిశీలించాలని తల్లితండ్రులకు డిఈఓ సూచించారు. విద్యాశాఖ నిబంధనలకు లోబడి పనిచేస్తుందో లేదో పరిశీలించాలి. ఫైర్ సేఫ్టీ, బిల్డింగ్ సామర్ధ్యం, క్వాలిఫైడ్ టీచర్స్ వంటి విషయాలు  పరిశీలించాకే పిల్లలను జాయిన్ చేయాలన్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలను ఏ సమయంలోనైనా సీజ్ చేసే అవకాశాలున్నందున ముందుగానే ఈ విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జూన్ ఒకటో తేది నుంచి నిబంధనలపై ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు.

మరిన్ని వార్తలు