అన్న క్యాంటిన్‌లో ఇచ్చి వెళ్లు! 

18 Dec, 2018 03:58 IST|Sakshi
సగం కప్పిన షెడ్లో వర్షంలో తడుస్తూ ఉన్న బాధితులు

సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్‌ తీరిది...

రసీదు కూడా ఇవ్వకుండా వెనక్కు పంపేస్తున్న వైనం

పట్టించుకునే నాథుడే లేడంటున్న బాధితులు

మూడు నుంచి ఐదుసార్లు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు  

తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): స్థానిక అధికారుల వద్ద సమస్యలు పరిష్కారం కాక.. తమ బాధను ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పుకోవాలని వస్తున్న బాధితులకు నిరాశే ఎదురువుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం కార్యాలయ గ్రీవెన్స్‌హాల్‌ పనితీరు ఘోరంగా తయారయింది. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇటీవల అసలు గ్రీవెన్స్‌హాల్‌లో అర్జీలు తీసుకునేవారు కూడా ఎవరూ ఉండడం లేదు. పైగా అన్న క్యాంటిన్‌లో అర్జీలు ఇచ్చి వెళ్లాలని చెబుతున్నారు. రసీదులు ఇవ్వకుండా వెనక్కు పంపించేస్తున్నారు. సోమవారం కూడా వివిధ ప్రాంతాలనుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు గ్రీవెన్స్‌ సెల్‌కు పలువురు వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురంలో చేస్తున్న అరాచకాల గురించి సీఎం దృష్టికి తీసుకువచ్చి తమ భూములను తమకు ఇప్పించాలని కోరేందుకు 10 మంది రైతులు వచ్చారు. మరికొంత మంది తమకు నాబార్డు నుంచి నిధులు కేటాయించి ఆదుకోవాలని అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్క రైతు స్థానికంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేను ఐదారుసార్లు కలవగా, సీఎం నివాసానికి రెండు సార్లు వచ్చినట్టు తెలిపారు. ప్రతి సోమవారం ఇక్కడకు రావడం అర్జీలు ఇచ్చి వెళ్లడం తప్ప పరిష్కారం కనిపించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ సారైనా సీఎంను కలుద్దామని పట్టుదలతో వస్తే ఆయన నివాసంలో లేరు. కనీసం అర్జీ తీసుకునే నాథుడు కూడా లేడు. ఉదయం 6 గంటల నుంచి వర్షంలో తడుస్తూనే ఉన్నాం. చివరకు అన్న క్యాంటిన్‌లో అర్జీలు తీసుకుంటున్నారని పోలీసులు చెబితే, అక్కడకు వెళ్లి అర్జీలు ఇచ్చాం. వారు రసీదులు ఇవ్వకుండా వెనక్కు పంపించివేశారు. ఇదేమని ప్రశ్నించిన వారికి ఇస్తే ఇవ్వండి లేకపోతే తీసుకువెళ్లండని అర్జీలు విసిరేశారు’’ అని బాధితులు సాక్షి వద్ద వాపోయారు. 

ఐదుసార్లు వచ్చినా ఫలితం లేదు.. 
నాకు 5 సంవత్సరాలప్పటి నుంచి కళ్లు కనిపిచడం లేదు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించమని కోరేందుకు ఆరు నెలల కాలంలో ఐదుసార్లు ఇక్కడికి ఇంటికి వచ్చా. ఇక్కడి సిబ్బంది నా ఫోన్‌ నంబర్‌ తీసుకుని అర్జీ తీసుకుని ఇంటికి వెళ్లమంటున్నారు. ఇప్పటివరకు నా సమస్య పరిష్కారం కాలేదు. 
– యనమల ఇంద్రాణి,అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలం 

ఎమ్మెల్యే అనుచరులు నా భూమిని ఆక్రమించుకున్నారు..  
మా ఎమ్మెల్యే అనుచరులు నా పంట పొలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికి రెండుసార్లు ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ నా సమస్య పరిష్కారం కాలేదు. ఈసారి సీఎం గ్రీవెన్స్‌ వద్ద నా గోడు విన్నవించుకునేందుకు వస్తే కనీసం అర్జీ కూడా ఎవరూ తీసుకోలేదు. చివరకు అన్న క్యాంటిన్‌లో అర్జీ ఇచ్చి వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి రసీదు కూడా వారు ఇవ్వలేదు. 
– చల్లా రంగప్ప, ప్రకాశం జిల్లా 

మరిన్ని వార్తలు