ఉప్పు రైతు కుదేలు

3 May, 2017 03:18 IST|Sakshi
ఉప్పు రైతు కుదేలు

వజ్రపుకొత్తూరు(పలాస) : అకాల వర్షాలు ఉప్పు రైతుల ఆశలను ఆవిరిచేస్తున్నాయి. మండుటెండలో ఒళ్లు గుళ్ల చేసుకుని పండించిన ఉప్పు పంట మొ త్తం సోమవారం రాత్రి కురిసిన జల్లులకు నాశనమైపోయింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉప్పు పంట దిగుబడి బాగుందని ఆశించిన తరుణంలో అకాల వర్షం కురవడంతో ఈసారి తీవ్ర నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వజ్రపుకొత్తూరు మండలంలోనే సుమారు రూ.5 లక్షల నష్టం సంభవించినట్లు ఉప్పు అధికారులు, రైతులు చెబుతున్నారు. తాజా వర్షాలతో ఉప్పు రాశులన్నీ వర్షార్పణం అయ్యాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

మడుల్లోనే ఉప్పు..
వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూరు, నగరంపల్లి, పూండి గల్లీ పరిధిలో సుమారు 350 ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. 520 మంది రైతులు, కార్మికులు ఉప్పు పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్నారు. ఒక రైతు ఏడాదికి ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో రూ.45 వేలు వరకు సంపాదిస్తాడు. ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో విక్రయాలు ప్రాంభం అవుతాయనుకునే సమయంలో అకాల వర్షం కురవడంతో ఉప్పంతా మడుల్లోనే ఉండిపోయింది. ఉప్పు రాశులు తడిసిపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ప్రారంభంలోనే రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది.

సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కో రైతుకు దాదాపు రూ.2 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వజ్రపుకొత్తూరు మండలంలో ఏటా సుమారు 675 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి ఒడిశాకు  తరలిస్తుంటారు. ఈ ఏడాది ఎగుమతి సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ప్రభుత్వం స్పందించి తమకు రుణాలు ఇప్పించాలని, వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేలా ఉప్పు పంట నష్టానికి పరిహారం మంజూరు చేయాలని యూనియన్‌ అధ్యక్షుడు కొరికాన అప్పారావు, వై.కోదండరావు, గోపి, తదితరులు కోరుతున్నారు

మరిన్ని వార్తలు