సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ఉపసంహరణ

10 Apr, 2017 12:22 IST|Sakshi

విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడం, అనూహ్యంగా బీజేపీ నుంచి కూడా ప్రతిఘటన రావడంతో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. తెలంగాణ అంశంపై లోక్సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే డిమాండ్‌తో లోక్‌సభను స్తంభింపజేసిన 11 మంది సీమాంధ్ర ఎంపీలను ప్రస్తుత లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు వాస్తవానికి గురువారమే బ్రేక్ పడింది. ప్రతిపక్షంతో పాటు యూపీఏకి మద్దతునిస్తున్న పార్టీలు కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో తీవ్ర గందరగోళం మధ్య తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ అర్థంతరంగా శుక్రవారానికి వాయిదా పడింది. ఇది పాలక పక్షానికి అనుకోని షాకిచ్చింది.

సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సభ్యుల పేర్లు చదవడం మొదలుపెట్టగానే బీజేపీ, శివసేన, అకాలీదళ్, జేడీ(యూ), బీజేడీ, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ సైతం తీవ్ర స్థాయిలో సస్పెన్షన్ నిర్ణయాన్ని నిరసించడంతో పాలకపక్షం ఖంగుతింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మరిన్ని వార్తలు