యూపీపీ.. ఉపేంద్ర కొత్త పార్టీ

19 Sep, 2018 13:13 IST|Sakshi

సాక్షి బెంగళూరు: విలక్షణ నటుడు ఉపేంద్ర కొత్త పార్టీని ప్రారంభించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)తో సరికొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కేపీజేపీ)కి గుడ్‌ బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుపై ఉపేంద్ర దృష్టి సారించారు. పాలనలో జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రజాకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రియల్‌స్టార్‌ ఉపేంద్ర మంగళవారం తన 51వ పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ తన నివాసంలో పార్టీని, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కులం, డబ్బు, వర్గం, ఆయుధాలను విడిచి జావాబుదారితనంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ ఆశయమని ఉపేంద్ర చెప్పారు. పల్లె, గ్రామం, నగరం తదితర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను మొబైల్‌తో చిత్రీకరించి పార్టీ వెబ్‌సైట్‌కు పంపించాలని సూచించారు. తాము ఆ వీడియో చూసి మేధావులతో చర్చించ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.  

పార్టీలో చేరేవారికి పరీక్ష  
దూరదృష్టి కలిగి, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని తెలిపారు. పార్టీలో చేరేవారికి తొలుత లిఖిత పరీక్ష నిర్వహిస్తామని ఉప్పి చెప్పారు. త్వరలోనే యాప్‌ విడుదల చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.  

ఒకే రోజు ముగ్గురి పుట్టినరోజు.. 
మంగళవారం కన్నడ చిత్రసీమలో ఒకేరోజు ముగ్గురు నటుల పుట్టినరోజు. దివంగత విష్ణువర్ధన్, రియల్‌స్టార్‌ ఉపేంద్ర, నటి శృతి పుట్టినరోజులు జరిగాయి. బెంగళూరులో విష్ణువర్ధన్‌ సమాధి వద్ద అభిమానులు పెద్దెత్తున పుష్పాంజలి ఘటించారు. రక్తదానం, అన్నదానం నిర్వహించారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా