కబళించినకడలి

12 Dec, 2013 03:04 IST|Sakshi
కబళించినకడలి

 పిఠాపురం, న్యూస్‌లైన్ : ఊరు సద్దు మణిగిన వేళ కడలి ఉగ్రరూపం దాల్చింది. ఆదమరిచి నిదురిస్తున్న సమయంలో ఆపదై విరుచుకుపడింది. కెరటాల కోరలతో తీరాన్ని కాటేసింది. ఇళ్లను కబళించి నిలువనీడ లేకుండా చేసింది. దారులను ధ్వంసం చేసి రాకపోకలను అడ్డుకుంది. చెట్లను, విద్యుత్ స్తంభాలను పెకలించి తన ప్రతాపాన్ని చాటింది.
 ‘మాదీ’ తుపాను ప్రభావం అంతగా ఉండదని అధికారిక వర్గాలు చెప్పినా మంగళవారం సాయంత్రం నుంచే యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట, ఉప్పాడల వద్ద అలల తాకిడి అంతకంతకూ పెరిగింది. మంగళవారం రాత్రి పదిగంటలు దాటాక సముద్రం ఒక్కసారిగా విలయతాండవమాడింది. మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడిన కెరటాలు కోనపాపపేటలో కిలోమీటర్ మేర తీరం పైకి 20 మీటర్ల వరకూ చొచ్చుకు రావడంతో తీవ్రంగా కోతకు గురై 34 మత్స్యకార గృహాలు కడలి కడుపులో కలిసిపోయాయి. సుమారు 65 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామంలో వేసిన సిమెంటురోడ్డు సైతం సముద్రంలో కలిసిపోయింది. అనేక కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలను అలలు పెకలించి వేశాయి.

ఒక్కసారిగా కెరటాల ఉధృతి పెరిగి తమ గృహాల పైకి విరుచుకుపడడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని, విలువైన సామాన్లు తీసుకుని పరుగులు తీశామని బాధితులు తెలిపారు. తుపాను ప్రభావం లేనప్పుడు హడావుడి చేసే అధికారులు.. కెరటాల రూపంలో తమ ఊరిపై విపత్తు విరుచుకుపడి, తీవ్రంగా నష్టపోతే తొంగి చూడలేదని మాజీ సర్పంచ్ కొర్ని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో తప్ప ఒక్క ఉన్నతాధికారి గ్రామానికి రాలేదని చెప్పారు. ఈదురు గాలుల తాకిడికి మిగిలిన గృహాలు కూడా దెబ్బ తింటున్నాయన్నారు. మరోపక్క బుధవారం సాయంత్రానికి అలల తాకిడి మరింత పెరగడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలకు ముప్పు వాటి ల్లే అవకాశం కనిపిస్తోంది.
 కాలినడక కూడా కష్టమే
 కాగా కెరటాల ఉధృతికి కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డు ఉప్పాడ వద్ద గతంలో ఎన్నడూ లేనట్టు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన కూడా వెళ్లలేనంతగా విధ్వంసమైంది. ఉప్పాడ వద్ద తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ కొంత వరకు ఆ గ్రామానికి రక్షణగా నిలవగా బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ మాత్రం కెరటాల తాకిడికి చెల్లా చెదురైంది.  కెరటాలతోపాటు రాళ్లు ఎగిరిపడుతుండడంతోపాటు బీచ్‌రోడ్డు అనేక చోట్ల నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది.

దీంతో బుధవారం ఉద యం నుంచి కాకినాడ-ఉప్పాడల మధ్య రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతో బీచ్‌రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 1996 తుపాను సమయంలో కూడా బీచ్ రోడ్డు ఇంత దారుణంగా కోతకు గురి కాలేదని స్థానికులు అంటున్నారు. బీచ్ రోడ్డును ధ్వంసం చేసిన కెరటాలు ఉప్పాడ వద్ద తీరం వెంబడి ఉన్న వరి సాగు చేసే భూములపై విరుచుకుపడ్డాయి. చేలన్నీ ఉప్పు నీటితో నిండిపోవడంతో రబీ సాగుకు పనికి రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు