ఉప్పుటేరు... గుండె బేజారు!

15 Jul, 2014 11:27 IST|Sakshi
ఉప్పుటేరు... గుండె బేజారు!

పూండి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఉప్పుటేరు పొంగి పొర్లుతుండటంతో వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక కాలిబాట వంతెన కొన్నిచోట్ల కొట్టుకుపోయింది. దీంతో పూడిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. 120 ఇళ్లు, 136 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి వంతెన నిర్మించాలన్న డిమాండ్ 50 ఏళ్లుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు.

ఇదే సమస్యపై గత ఏడాది ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన ఫొటో కథనానికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. అప్పట్లో కొంత హడావుడి చేసిన అధికారులు, తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశారు.  గతంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించినా చర్యలు లేవు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతులు కూడా అందజేశారు.

గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన ఫై లీన్ తుపాను సందర్భంగా కొండవూరు నుంచి గ్రామానికి గ్రావెల్ రహదారి మంజూరు చేస్తామని నిన్నటి వరకు కలెక్టర్‌గా ఉన్న సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే ఉప్పుటేరు పొంగింది. కాలిబాట మూడు చోట్ల తెగిపోయింది. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయింది. వర్షాల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే భారీవర్షాలు పడితే తమ గతి ఏమిటని సర్పంచ్ తిమ్మల పవిత్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు