రసాభాసగా జన్మభూమి కార్యక్రమం

2 Jan, 2019 18:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 6వ విడత జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో టీడీపీ నాయకులు నెత్తిపట్టుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడిలో తనకు ఉండటానికి ఇల్లు లేదని మంత్రి గంటా శ్రీనివాస రావుని ఓ వృద్ధురాలు నిలదీసింది. అధికారం వచ్చి ఐదేళ్లయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవంటూ తులపాలెం గ్రామస్తులు మంత్రి గంటా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వద్దకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.

అలాగే పెథాయ్‌ తుపాను నష్టపరిహారం అందలేదని, తుపాను బాధితులకు రేషన్‌ ఇవ్వలేదని పాయకరావు పేట మండలం సమరపురంలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం కూడా రసాభాసగా మారింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న డీటీ వెంకటేశ్వర్లు వేధింపులకు గురి చేస్తున్నారని  పోలవరం నిర్వాసితులు ఆరోపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో నిరసన వెల్లువెత్తింది.

చిత్తూరులో రచ్చ రచ్చ

చిత్తూరు జిల్లాలో జన్మభూమి సభల్లో రచ్చ రచ్చ జరిగింది. చంద్రగిరి మండలం పనబాకలో స్థానికులు నిరసనకు దిగారు. మరుగు దొడ్ల నిధులు మంజూరు చేయలేదని స్థానికులు గొడవకు దిగారు. కల్రోడ్డుపల్లిలో దళితులు నిరసన వ్యక్తం చేశారు. మాకు టీడీపీ అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్థి నానిని దళితులు నిలదీశారు. జన్మభూమి సభలో బీజేపీ మీద ఆరోపణలు చేయటం దారుణమని బీజేపీ నేతలు కార్వేటీనగర్‌లో గొడవ సృష్టించారు.

మరిన్ని వార్తలు