అర్బన్‌ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌

25 Jun, 2019 09:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: పట్టణాల్లో వార్డు వలంటీర్ల నియామకానికి జిల్లా కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువత నుంచి సర్కారు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన వారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆయా జిల్లాల్లో గల మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా తీసుకున్నారు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనల ప్రకారం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పట్టణాల్లో 38,68,811 కుటుంబాలు ఉండగా.. ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 77,375 మంది వలంటీర్లను నియమించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు.

కాగా, నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలు, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను, వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించడానికి ఏడాదికి రూ.486 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25 వరకు మౌఖిక పరీక్ష, ఆగస్టు 1న వలంటీర్లకు సమాచార లేఖ పంపించటం షెడ్యూల్‌గా నిర్ణయించారు. ఎంపికైన వారికి ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణ ఇస్తారు. వారంతా ఆగస్టు 15న విధులను ప్రారంభించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు http://gramavolunteer2.ap.gov.in/GRAMAVAPP/VV/index.html వైబ్‌సైట్‌ చూడండి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు