‘పది’లో ఉర్దూ తడాఖా !

16 May, 2018 09:12 IST|Sakshi
వంద శాతం ఫలితాలు సాధించిన పూనేపల్లె పాఠశాల

16 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

అరకొర టీచర్లతోనే అత్యుత్తమ ఫలితాలు

ఖాళీలు పూరిస్తే మరిన్ని విజయాలకు అవకాశం

జిల్లాలో ఉర్దూ పాఠశాలలు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత తీర్చకపోయినా,  తగినన్ని వసతులు కల్పించకపోయినా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఇతర పాఠశాలలకు తీసిపోని విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాయి. జిల్లాలో  28 ఉర్దూ ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 16  పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా నిలిచాయి.

మదనపల్లె సిటీ: పదో తరగతిలో జిల్లాలో ఉర్దూ పాఠశాలలకు ఉత్తమ ఫలితాలు లభించాయి. మారుమూల ప్రాంతాలైన పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని వి.కోట ఉర్దూ మెయిన్, నడిపేపల్లి, కొంగాటం, మండల కేంద్రాలైన రామకుప్పం, బైరెడ్డిపల్లె, రొంపిచెర్ల, పీలేరు, బి.కొత్తకోట, యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్, మదనపల్లె రూరల్‌ మండలం బాలాజీనగర్, పెద్దతిప్పసముద్రం, ,పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 22 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి ఆధిక్యతను చాటుకున్నాయి.

ఉన్న టీచర్లపైనే భారమంతా ...
ఉర్దూ పాఠశాలల్లో డీఎస్సీ నియామకాలు జరిగినప్పుడల్లా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తూనే ఉన్నారు. కానీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం 50 శాతానికి పైగా పోస్టులు ఎస్సీ,ఎస్టీ, బీసీ–ఏ,సీ,డీ కేటగిరీలకు కేటాయిస్తుండటంతో అభ్యర్థులు లేక అవి చాలాకాలంగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉర్దూ పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లే భారమంతా మోస్తూ నెట్టుకొస్తున్నారు. వి.కోట మండలంలోని కొంగాటం ఉర్దూ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, రామకుప్పం మెయిన్‌ పాఠశాల ఒక ఉపా«ధ్యాయుడితోనే వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. అలాగే తిరుపతిలోని నెహ్రూ నగర్‌ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు కూడా లేకున్నా  ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలు, ఓ తెలుగు ఉపాధ్యాయునితో 95 శాతం  ఫలితాలు సాధించారు. మెరుగైన వసతులు కల్పించి , పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఇతర పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉర్దూ పాఠశాలలు ఫలితాలు సాధిస్తాయనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు