సీఎం జగన్‌తో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ భేటీ

16 Oct, 2019 18:11 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు.

గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై రిఫ్‌మాన్‌ ప్రశంసలు కురిపించారు.

మరోవైపు ముఖ్యమంత్రితో  హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్‌ తయారీ కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి( ఎస్‌ఈజెడ్‌) ఏర్పాటుపై చర్చించారు. ఈ ఆర్ధిక మండలి ఏర్పాటుకు  రూ.700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ ప్రతినిధులు చెప్పారు. అనుమతి ఇచ్చిన ఐదేళ్లలోగా రూ.350కోట్ల రూపాయల ఖర్చుతో మొదట విడత పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారు. విస్తరణ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఇన్వెస్టిమెంట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్ధే ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు ఈ సంస్ధ నుంచే వస్తున్నాయి. భారత్, చైనా, వియత్నాం దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రూ. 1750 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్లను నిర్వహిస్తూ 25వేలమందికి ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలిస్తోంది. నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్‌వేర్‌ ఎస్‌ఈజెడ్‌లో ఇంటెలిజెంట్‌ సంస్ధ భాగస్వామి. 

ఏపీలో 2006 నుంచి ఈ సంస్ధ  నెలకు 12 లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 11వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అలాగే వియత్నాంలో కూడా ఏడాదికి 50లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆ దేశంలో దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 

గవర్నర్‌ను కలిసిన కాన్సులేట్‌ జనరల్‌ 
కాగా అంతకు ముందు అమెరికన్ కాన్సుల్ జనరల్ రీఫ్‌మెన్, కాన్సుల్ సభ్యులు బుధవారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరువురి మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి.  అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే విశాఖ స్మార్ట్ సిటి ఏర్పాటులో తమ భాగస్వామ్యం ఉంటుందని, నిధులు సద్వినియోగం అవుతున్నాయని కాన్సుల్ జనరల్ వివరించారు. అమెరికన్ కంపెనీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వారే గణనీయంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింతగా వారికి అవకాశాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. అలాగే అమెరికా, భారత్‌లోని గవర్నర్ వ్యవస్ధలపై వీరిరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు