స్పందించకుంటే పెను నష్టం

9 Feb, 2019 17:35 IST|Sakshi
కొబ్బరితోటల్లో వదులుతున్న డైకోక్రైసా బదనికలు

ఉభయ గోదావరి జిల్లాలను వణికిస్తున్న వలయాకార తెల్లదోమ

అమెరికా నుంచి తమిళనాడు.. అక్కడి నుంచి గోదావరి జిల్లాలకు విస్తరణ

రోజు రోజుకూ ఉధృతం.. స్పందించకుంటే పెను నష్టం

కొబ్బరి, ఆయిల్‌పామ్, అరటి, నర్సరీలపై ప్రభావం

భారీగా తగ్గిపోతున్న దిగుబడి

అమలాపురం: ఖండాంతరాలు దాటి కడియపు లంకకు చేరుకున్న శత్రువు పచ్చని గోదారి జిల్లాలను పీల్చి పిప్పి చేస్తోంది. ఎటు చూసినా పచ్చని పైర్లు, పండ్ల తోటలు, నర్సరీలతో అలరారే ఉభయగోదావరి జిల్లాలు ఈ శత్రువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు.. తరువాత కడియం నర్సరీలకు..అక్కడ నుంచి క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది రూగోస్‌ వైట్‌ఫ్‌లై (వలయాకారపు తెల్లదోమ). తొలుత నర్సరీల్లోని మొక్కలకు.. తరువాత కొబ్బరి.. ఆయిల్‌ పామ్‌.. తాజాగా అరటి, మామిడి, జీడిమామిడి, సీతాఫలం, సపోటా, పనస..ఇలా అన్ని రకాల పంటలను ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

కేరళ, తమిళనాడు కొబ్బరి రైతులకు వలయాకార తెల్లదోమ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అక్కడ దిగుబడి 40 శాతం వరకు పడిపోయింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఈ దోమ ఉధృతికి తోడు వర్షాలు లేక వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయి. మూడేళ్ల క్రితం దీని జాడ కనిపించినా ఇప్పటికీ ఉధృతి తగ్గలేదు. మన రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న కొబ్బరి మొక్కల ద్వారా ఇది వ్యాపించింది. తరువాత కడియం నర్సరీకి వ్యాపించింది. నర్సరీ మొక్కల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దీని ఉధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి 1.78 లక్షల ఎకరాల్లోను, ఆయిల్‌పామ్‌ 98 వేల ఎకరాలు, అరటి 74 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక కడియం, పరిసర ప్రాంతాల్లో 14 వేల 500 ఎకరాల్లో పూలు, పూలమొక్కలు, ఆర్నమెంట్‌ సాగు చేస్తున్నారు.  

దిగుబడిపై పెనుప్రభావం...
కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ దీర్ఘకాలిక పంటలు. అరటి కార్సి తోట పంట కావడం వల్ల మూడేళ్లపాటు రైతులకు ఆదాయాన్నిస్తోంది. ఈ పంటలను తెల్లదోమ ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. నర్సరీ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గడచిన రెండేళ్లుగా తెల్లదోమ వల్ల సుమారు 30 శాతం విక్రయాలు తగ్గిపోయాయని నర్సరీ రైతులు చెబుతున్నారు. మొక్క ఆకుల దిగువు భాగాన్ని ఈ తెల్లదోమ అశిస్తోంది. ఇది వదిలే వ్యర్థం ఆకు ఎగువ భాగంలో దట్టమైన నల్లని పొర రూపంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఆకుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు బలహీనంగా మారి దిగుబడి పడిపోతోంది. వాతావరణంలో తేమ పెరిగే కొద్దీ ఇది శరవేగంగా విస్తరిస్తోంది.

చేతులెత్తేసిన అధికారులు..
తెల్లదోమ నిర్మూలన విషయంలో ఉద్యాన శాఖ అధికారులు చేతులెత్తేశారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దీన్ని నివారించేందుకు కొంతవరకు చర్యలు చేపట్టారు. గతంలో కడియం మొక్కలను గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారు. తెల్లదోమను అరికట్టేందుకు ఎల్లోస్టిక్స్‌ (పసుపురంగు అట్టలు), ఎన్‌కార్సియా గ్వడెలోపే, ఎన్‌కార్సియా డిస్‌పెర్సా (బదినికలు), వేపనూనె మందులను అందించారు. డ్రోన్లను తీసుకు వచ్చి మందులు పిచికారీ చేయించారు. కేరళ, తమిళనాడు నుంచి తెల్లదోమ సోకిన మొక్కలు రాగా వాటిని గుర్తించి తగులబెట్టారు. తొలి ఆరు నెలల్లో దీని ఉధృతిని అరికట్టేందుకు కృషి చేసిన ఉద్యానశాఖ అధికారులు తరువాత కాలంలో అలసత్వం ప్రదర్శించారు. దీనికితోడు రైతులు సైతం సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో దీని ఉధృతి క్రమేపీ తీవ్రమవుతోంది. అన్ని ప్రాంతాల్లోను కొబ్బరి, అరటి, ఆయిల్‌ పామ్‌ తోటలకు ఇది విస్తరిస్తోంది. ఇప్పటివరకు గోదావరి జిల్లాల కొబ్బరిలో 30 శాతం అంటే సుమారు 50 వేల ఎకరాలకు పైబడి ఈ వ్యాధి సోకిందని అంచనా. చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నిర్మూలనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తాజాగా డ్రైకోక్రైసా ఆస్టర్‌ మిత్ర పురుగులను రైతులకు అందిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.

మిత్ర పురుగులతో ఎదుర్కొంటున్నాం...
తెల్లదోమ ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. రసాయన మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతి, మిత్ర పురుగులు వినియోగం ద్వారా చాలా వరకు దీన్ని అరికట్టే అవకాశముంది. ఎన్‌కార్సియా గ్వడెలోపే, డైకోక్రైసాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం.
– ఎన్‌.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్టు, వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట

మరిన్ని వార్తలు