ఈవీఎంల వయసు 37ఏళ్లు 

15 Mar, 2019 09:38 IST|Sakshi

సాక్షి, కర్నూలు(వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): స్వతంత్ర భారతావనిలో ఎన్నికలను తొలుత పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా నిర్వహించేవారు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951లో జరుగగా.. ఆ సమయంలో బ్యాలెట్‌ విధానం ఉంది. 1982లో తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)ను అందుబాటులోకి వచ్చింది. ప్రప్రథమంగా కేరళలో వాటిని వినియోగించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ వీటి నిర్వహణలో లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. 2004 ఎన్నికల నుంచి వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో మరింత పారదర్శకత కోసం 2013 నుంచి వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరిఫయిబుల్‌ పేపర్‌ అడిట్‌ ట్రయల్‌)ను ఈవీఎంలకు అనుసంధానం చేశారు.  
- మొదటిసారి కేరళ రాష్ట్రంలోని ఉత్తర పెర్వూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో  1982 మే 19న వినియోగించారు. 
- ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వీటిని వినియోగించారు. 
- ఈవీఎంలను ఉపయోగించ వద్దని 1984 మే 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
- ఈవీఎంల వాడకానికి 1988లో ప్రజామోదం లభించింది. 
- ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్‌లో సెక్షన్‌ 61ఏ ద్వారా కేంద్రం ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చి సవరణ చేశారు. ఆ తర్వాత 1989 మార్చి 15న అమలులోకి రావడంతో సుప్రీంకోర్టు కూడా తర్వాత సమర్థించింది.  
- 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీ (ఈఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వినియోగాన్ని సాంకేతిక నిపుణల కమిటీ సమర్థించింది.  
- 1999, 2004లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు.  
- లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. 
- వీవీ ప్యాట్‌లను  ఈవీఎంలకు అనుసంధానం చేయాలని 2013 ఆగస్టు 14న నిర్ణయించారు.  
- నాగాలాండ్‌ రాష్ట్రంలోని ఆక్సె అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్‌ 4న జరిగిన ఎన్నికల్లో వీవీ ప్యాట్‌లను మొదటి సారిగా వినియోగించారు. 
- దశల వారీగా వీవీ ప్యాట్‌లను వినియోగించాలని 2013 అక్టోబరు 8న  సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి వీవీ ప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. 
- 2017 ఏప్రిల్‌లో రూ. 3173.47 కోట్లతో 16.15లక్షల వీవీ ప్యాట్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్‌లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు