కాలం చెల్లిన బస్సులే కాలయముళ్లు

29 Oct, 2017 03:02 IST|Sakshi

ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల వినియోగం

12 లక్షల కి.మీ దాటిన బస్సులను నడపకూడదని నిబంధనలు

15 లక్షల కి.మీ దాటిన మృత్యుశకటాలనూ నడుపుతున్న యాజమాన్యం

డిపోల్లో అనుభవం లేని మెకానిక్‌లు ఫలితంగా ప్రమాదాలు

విజయవాడ దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత

నష్టాల్లో ఉన్న  ఆర్టీసీని ఆదుకోని ప్రభుత్వం  

సాక్షి,అమరావతిబ్యూరో/విశాఖపట్నం    ఆర్టీసీ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. కాలం చెల్లిన బస్సులను నడపుతుండటంతో అవి ప్రజల నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. నష్టాల్లో కూరుకుపోయి, నూతన బస్సులను కొనలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ డొక్కు బస్సులకే రంగులద్ది రోడ్లమీదికి వదులుతోంది. దీంతో వాటికి తరచూ బ్రేకులు ఫెయిలవడం.. టైర్లు పగిలిపోవడం వంటివి జరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఇంత జరుగుతున్నా ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

1993–97 నాటి బస్సులే అధికం..
రాష్ట్రంలో 123 ఆర్టీసీ డిపోలుండగా.. 12,000 ఆర్టీసీ బస్సులున్నాయి. వాటిలో దాదాపు 1600 దాకా కాలం చెల్లిన బస్సులున్నాయి. కృష్ణా రీజియన్‌ పరిధిలో 14 డిపోలున్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, ఉయ్యూరు, గవర్నర్‌పేట 1, 2, గన్నవరం పరిధిలో మొత్తం ఆరు డిపోలున్నాయి. వీటిలో మొత్తం 442 సిటీ బస్సులు రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అందులో 250 బస్సులు కాలం చెల్లినవి కావడంతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఈ బస్సుల్లో సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచేవి 299 ఉండగా.. మిగిలినవన్నీ డీజిల్‌తో నడిచేవే. ఈ డీజిల్‌ బస్సులు అధికంగా 1993–97 సంవత్సరాల నాటివే. అవి ఇప్పటి వరకూ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోమీటర్లు వరకూ తిరిగాయి. 12 లక్షల కిలోమీటర్ల తర్వాత ఒక్క కిలో మీటరు కూడా అదనంగా తిప్పకూడదు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ నిబంధన పాటించలేని స్థితిలో ఉంది. కాలం చెల్లిన ఈ బస్సులు ప్రయాణికులకు నిత్యం నరకాన్ని చూపుతున్నాయి. బస్సు వెళ్తున్నప్పుడు, బ్రేకులు వేసినప్పుడు పెద్ద పెద్ద శబ్ధాలు, వానొస్తే నీరు కారడాలు వంటివి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో హెడ్‌లైట్లు కూడా సక్రమంగా వెలుతురును ఇవ్వడంలేదు. విజయవాడ నగరంలో పెరిగిన జనాభా అవసరాల దృష్ట్యా ఇంకా 400 బస్సులు అవసరమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.  

మొరాయిస్తూ.. బెంబేలెత్తిస్తూ..
కాలం చెల్లిన బస్సులు నగరవాసుల ప్రాణాలు తీస్తున్నాయి. నగరంలో శుక్రవారం బుడమేరు వంతెన వద్ద సిటీ బస్సు సృష్టించిన బీభత్సంతో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో బస్సు వెళ్తుండగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద పుట్‌ రెస్ట్‌ జారిపడిపోయింది. మాచవరం ప్రాంతంలో స్టీరింగ్‌ ఊడిపోయింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. గతంలో విద్యాధరపురం ప్రాంతంలో రెండు సార్లు టైర్లు పగిలి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇటీవల బందర్‌ రోడ్డులోని రేడియో స్టేషన్‌ వద్ద  ప్రమాదవశాత్తు ఓ బస్సు పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన విషయం తెలిసిందే.  

ఔట్‌ సోర్సింగ్‌తో అనుభవం లేని మెకానిక్‌లు..
ఆర్టీసీ గ్యారేజ్‌లో మెకానికల్‌ విభాగంలో ఎక్కువ మంది అనుభవం లేని వారే. సీనియర్‌ మెకానిక్‌లు రిటైర్డ్‌ అవుతుండటంతో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌లో కొత్త వారిని తీసుకుంటున్నారు. వారంతా యువకులు కావడంతో వారికి బస్సుల మరమ్మతులపై సరైన అవగాహన లేదు. కేవలం డ్రైవర్లు చెప్పిన లోపాలను తాత్కాలికంగా సరిచేసి పంపుతున్నారు. మెకానిక్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క విజయవాడ డిపోలోనే 23 మంది మెకానిక్‌ల కొరత ఉంది. 20 మంది చేయాల్సిన పనిని 10 మందితో చేయిస్తుండటంతో మరమ్మతులు చేసే సమయంలో లోపాలన్నింటినీ సరిచేయలేకపోతున్నారు. విజయవాడలో జరిగిన ఘటనలో తాత్కాలికంగా బ్రేక్‌ను సరిచేసి పంపినందునే బ్రేక్‌ ఫెయిల్‌ అయిందని కార్మికులు చెబుతున్నారు.  

విశాఖ రీజియన్‌లో కాలం చెల్లిన బస్సులు 370, నగరం పరిధిలో 205
ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో 1350కి పైగా బస్సులున్నాయి. రీజియన్‌లో 10 నుంచి 17 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను కూడా నడుపుతున్నారు. వీటిలో వందకు పైగా 13 లక్షల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నవి ఉన్నాయి. విశాఖ రీజియన్‌లో సుమారు 370 వరకూ కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నారు. రీజియన్‌కు ఏటా 50 కొత్త బస్సులు అవసరమవుతుండగా యాజమాన్యం అందులో సగం కూడా సమకూర్చడం లేదు. విశాఖ నగరంలో మొత్తం ఏడు డిపోలుండగా.. 670 సిటీ బస్సులున్నాయి. వాటిలో కాలం చెల్లిన బస్సులు 205 ఉన్నాయి. నగర పరిధిలో ఇంకా 35 బస్సులు అవసరం.

కమీషన్ల కక్కుర్తే కాటేసింది!?

విజయవాడలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన వెనుక కమీషన్ల కక్కుర్తి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సుల మరమ్మతులకు వినియోగించే స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అతి తక్కువ కొటేషన్‌ ఇచ్చిన వారిని ఓకే చేయడం వెనుక కమీషన్ల మర్మం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిలో నాణ్యత కరువవడంతో అవి తక్కువ సమయంలోనే దెబ్బతింటున్నాయి.

నాణ్యత లేమే కారణం
విజయవాడ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవడానికి కారణం నాసిరకం బ్రేక్‌ లైనింగ్‌ అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బస్సు 18 వేల కిలోమీటర్లు తిరిగినçప్పుడు మరమ్మతులు(షెడ్యూల్‌–3)చేస్తారు. అంటే నాలుగు చక్రాలు తీసి గ్రీజ్‌ పెట్టి బ్రేక్‌ లైనింగ్‌ పరిశీలించి పంపుతారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఈ నెల 20న మరమ్మతులు (సాంకేతిక పరిభాషలో షెడ్యూల్‌–3) చేశారు. అలా మరమ్మతులు చేస్తే మళ్లీ 18 వేల కిలోమీటర్లు తిరిగే వరకూ రిపేర్లు రాకూడదు. ఈ బస్సు గురించి ఈ నెల 26 వ తేదీన డ్రైవర్‌ లాగ్‌షీట్‌లో బ్రేక్‌లో ఎయిర్‌దిగి బ్రేక్‌లు పడటంలేదు.. అని ఫిర్యాదు నమోదుచేశాడు. మెకానిక్‌ పరిశీలించి తాత్కాలికంగా రిపేర్‌చేసి పంపారు. అయినా శుక్రవారం బ్రేక్‌లో ఎయిర్‌ దిగి వెంటనే పడలేదు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రధానమైన బ్రేక్‌ లైనింగ్‌ నాణ్యమైనవి వాడితే లక్ష కిలోమీటర్లు తిరిగే వరకు ఇబ్బంది ఉండదు . కానీ బ్రాండెడ్‌ పేరుతో వాడే నాసిరకం లైనింగ్‌ల వల్ల కొద్దిరోజులకే పాడవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విజయవాడ బస్సు ఘటనలో ఇదే జరిగినట్లు నిపుణులు చెపుతున్నారు.

మరిన్ని వార్తలు