రాజధానిలో యూజర్‌ చార్జీలు

26 Apr, 2018 04:20 IST|Sakshi
సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం

వాణిజ్య సంస్థల నుంచి వసూలుకు ప్రతిపాదన 

రాజధానిలో 10 ఎకరాల్లో షాపింగ్‌ మాల్‌

రోడ్ల పక్కన కంటెయినర్‌ హోటళ్లు 

సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయాలు

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిం చేందుకు వచ్చే సంస్థలపై యూజర్‌ చార్జీల భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఆర్‌డీఏ అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. రాజధానిలో నిర్మించబోయే పైప్‌లైన్‌ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ఈ చార్జీలు వసూలు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు.

యూజర్‌ చార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చని సూచించారు. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్‌ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేయబోయే పైప్‌లైన్‌ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.. అన్ని రకాల కేబుళ్లు, పైప్‌ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాల్సివుంటుందని, ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. తొలుత అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. 203 మంజూరు చేయగా అందులో 187 క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
 
10 ఎకరాల్లో షాపింగ్‌ మాల్‌..
అమరావతి నగరంలో 10 ఎకరాల్లో షాపింగ్‌ మాల్‌ నిర్మించాలని, థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, రిటైల్‌ షాపింగ్‌ సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని సీఆర్‌డీఏ నిర్మించి నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఏడాదిన్నరలో 38 వేల కుటుంబాలు రాజధానికి తరలివస్తాయన్న అంచనాతో వారి అవసరాల నిమిత్తం ఈ మాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాజధానిలోని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్‌ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ హోటళ్ల ప్రతిపాదనను విజయవాడలోని మురళీ ఫారŠూచ్యన్‌ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు.

ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా మహిళల ఆరోగ్య పరిరక్షణ (కేన్సర్‌పై లక్ష మందికి అవగాహన కల్పణ) కార్యక్రమానికి సంబంధించిన రెండు అవగాహన ఒప్పందాలను మెప్మా, హెల్త్‌ యూనివర్శిటీ, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో చేపట్టనుంది. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

వెయ్యి అపార్టుమెంట్లు నిర్మిస్తాం
రూ.494 కోట్లతో రాజధానిలో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ చెప్పారు. సీఆర్‌డీఏ సమావేశం తర్వాత ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగుల కోసం వీటిని నిర్మిస్తున్నామని, నిర్మాణం పూర్తయ్యాక వేలం ద్వారా వారికి విక్రయిస్తామన్నారు. జీ+11 విధానంలో మూడు కేటగిరీల్లో ఈ అపార్టుమెంట్లు నిర్మిస్తామని ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలు కేటాయించిందన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500 అపార్టుమెంట్లు, 1500 అడుగుల్లో 300, 1800 అడుగుల్లో 200 అపార్టుమెంట్లను నిర్మిస్తామన్నారు. చదరపు అడుగును రూ.3,500కు విక్రయిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు