చార్జీల కొరడా

20 Apr, 2015 04:30 IST|Sakshi

జిల్లా టార్గెట్ రూ. 20 కోట్లు
రెట్టింపైన చార్జీలు ఇప్పటికే అమల్లోకి..

 
ఖజానాకు దండిగా ఆదాయాన్ని సమకూర్చేందుకు రవాణా శాఖ వాహనదారులకు యూజర్ చార్జీల బాదుడు మొదలుపెట్టింది. రూ. 20 కోట్లు వసూళ్ల లక్ష్యంగా అన్ని రకాల సేవల చార్జీలను అమాంతం నూరు శాతం పెంచేసింది.

సాక్షి, విజయవాడ : వాహనదారులకు రవాణా శాఖ గట్టి షాక్ ఇచ్చింది. రవాణా సేవలకు ఉన్న చార్జీలను భారీగా పెంచింది. తద్వారా జిల్లాలో భారీగా ఆదాయం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ  లేని విధంగా భారీగా యూజర్ చార్జీలను పెంచి వాహనదారుల నడ్డి విరిచింది. ఇప్పటికే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గత ఏడాది జిల్లాలో యూజర్ చార్జీల ద్వారా వచ్చిన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం రెట్టింపు కానుంది. రూ. 20 కోట్ల వసూళ్లే లక్ష్యంగా ఈ శాఖ పనిచేయనుంది. 2001లో యూజర్ చార్జీలను నిర్ణయించి ప్రతి సేవకు నామమాత్రంగా ఫీజులు తీసుకునేవారు.

ఈ శాఖ ద్వారా సుమారు 20కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్ మొదలుకొని నూతన వాహన రిజిస్ట్రేషన్ వరకు అనేక సేవలను అమలు చేస్తూ నిత్యం రవాణా శాఖ కార్యాలయాలు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. నగరంలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంతోపాటు గుడివాడ, నందిగామల్లో ఆర్టీవో కార్యాలయాలు, నాలుగు చోట్ల యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకి ఐదువేల వరకు వివిధ లావాదేవీలు జరుగుతుంటాయి. వీటిలో 50 శాతం నగరంలోని డీటీసీ కార్యాలయంలోనే జరుగుతుంటాయి.

జిల్లాలో రోజుకి సగటున 500 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, కొత్త లెసైన్స్‌లు, లెసైన్స్‌ల రెన్యువల్స్ కలిపి సుమారు 1000 వరకు జరుగుతుంటాయి. వాహన ట్రాన్స్‌ఫర్స్, చిరునామా మార్పు, సేల్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ల జారీ, ఇతర సేవలు అన్నీ కలిపి 3500  లావాదేవీలు జరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకి సగటున రూ. 3 లక్షల పైనే యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. పెరిగిన చార్జీలతో ఇది రూ. 6 లక్షలు దాటే అవకాశం ఉంది.

లెర్నింగ్ లెసైన్స్ (ఎల్‌ఎల్‌ఆర్)కు గతంలో ఫీజు రూ. 30 కాగా ఇప్పుడు రూ. 60 చేశారు. ద్విచక్ర వాహనాల లెసైన్స్‌కు రూ. 100 చార్జీ ఉండగా ఇప్పుడు రూ. 150గా మార్చారు. గతంలో రూ. 100 ఉన్న లారీలు, కార్లు, బస్సుల రిజిస్ట్రేషన్ ఫీజును రూ.150కు పెంచారు. రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో యూజర్ చార్జీల  ద్వారా వచ్చేది 10 శాతంగా ఉంటుంది. అన్ని సేవలకు సంబంధించి కనీస రుసుము కడితేనే సంబంధిత దరఖాస్తు పరిశీలిస్తారు.

నూరు శాతం పెరిగిన చార్జీలు
యూజర్ చార్జీల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని రకాల చార్జీలు సగటున 50  నుంచి వంద శాతం పెరిగాయి.  ఆదాయం కూడా రెట్టింపయింది.  ఏటా రవాణా శాఖ వివిధ రకాల సేవలకు సంబంధించి వచ్చే ఆదాయాన్ని ముందుగానే అంచనా వేసి టార్గెట్లు నిర్దేశిస్తారు. అలా నిర్దేశించిన టార్గెట్లతో 80 శాతం వరకు లక్ష్యం చేరుకుంటున్నారు.

2013-14 ఆర్థిక సంవత్సరంలో  రూ. 6.64 కోట్లు లక్ష్యం కాగా రూ. 5.76 కోట్లు రాబట్టగలిగారు.   2014-15కు రూ. 8.82  కోట్లు లక్ష్యం కాగా రూ. 7.80 కోట్లు రాబట్టగలిగారు. ఈ పరిణామాల క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రెట్టింపవుతుందని ముందుగానే అంచనా కట్టి దానికి అనుగుణంగా  లక్ష్యాన్ని  నిర్దేశిస్తున్నారు.

మరిన్ని వార్తలు